పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్! | Vash 2 Movie Review Telugu | Sakshi
Sakshi News home page

OTT Review: భయంకరమైన సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్.. ఓటీటీ రివ్యూ

Oct 26 2025 7:45 AM | Updated on Oct 26 2025 7:57 AM

Vash 2 Movie Review Telugu

హారర్ సినిమా అంటే ఓ రేంజులో భయపెట్టాలి. మొదటి సీన్ నుంచే మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోవాలి. కానీ మన దగ్గర రీసెంట్ టైంలో తీసే మూవీస్‌లో చాలావరకు అలాంటి మ్యాజిక్ చేయలేకపోతున్నాయి! అందుకే మూవీ లవర్స్.. కొరియన్, హాలీవుడ్ హారర్ చిత్రాల వెంటపడుతున్నరు. ఇప్పుడు అలాంటి వాళ్లని ఓ గుజరాతీ సినిమా తెగ భయపెట్టేస్తోంది. అదే 'వష్ 2'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ సంగతేంటి? ఎలాంటి థ్రిల్ ఇచ్చిందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)

2023లో గుజరాతీలో 'వష్' అనే సినిమా రిలీజైంది. వశీకరణం స్టోరీతో వచ్చిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది. దీన్ని హిందీలో అజయ్ దేవగణ్ 'సైతాన్' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. దీంతో 'వష్' గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ దర్శకనిర్మాతల నుంచి సీక్వెల్ వచ్చింది. 'వష్ లెవల్ 2' పేరుతో తీశారు. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. గుజరాతీతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

కథేంటి?
తొలి భాగానికి కొనసాగింపుగా 'వష్ 2' మొదలవుతుంది. మొదటి భాగంలో మాంత్రికుడికి ఉన్న శిష్యుడు.. ఓ స్కూల్‌లో చదివే 50 మందికి పైగా అమ్మాయిలని వశీకరణం ద్వారా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాడు. ఇతడి వశంలో ఉన్న కొందరు అమ్మాయిలు.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. మరికొందరైతే ఊరిమీద పడి జనాలని దారుణంగా చంపేస్తుంటారు. అసలు దీనంతటికీ మూలకారణం ఏంటి? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? చివరకు అమ్మాయిలు బతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా స్టోరీ.

స్కూల్ పిల్లలు, ఓ మాంత్రికుడు, దుష్టశక్తులు.. ఇదే 'వష్ 2' సినిమా మెయిన్ ప్లాట్. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా! అయినా పిల్లలతో హారర్ మూవీ ఎవరైనా తీస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ చూస్తున్నంతసేపు ఓవైపు భయమేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆత్రుత మరోవైపు కలుగుతూ ఉంటుంది. చెప్పాలంటే లోకల్‌గా తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్ కంటెంట్ డెలివరీ చేశారని చెప్పొచ్చు.

ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైతే.. అదే నెలలో 'వెపన్స్' అనే హాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండింటి కాన్సెప్ట్ దాదాపు ఒక్కటే. కొన్ని షాట్స్ అయితే అరే ఒకేలా ఉన్నాయేంటి అని కచ్చితంగా అనిపిస్తుంది. ఒకే నెలలో రిలీజ్ కావడం వల్ల కాపీ అనే ప్రసక్తి రాదు. సరే 'వష్ 2' విషయానికొస్తే ఓ స్కూల్, ఉదయం కాగానే వచ్చే పిల్లల సందడితో సినిమా మొదలవుతుంది. సరిగ్గా 13 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. పదిమంది ఆడపిల్లలు.. బిల్డింగ్ పైకెక్కి అక్కడినుంచి దూకి చనిపోతారు. అలా మొదలయ్యే టెన్షన్, థ్రిల్.. ఎండ్ కార్డ్ పడేవరకు ఆపకుండా ఉంటుంది.

కేవలం 100 నిమిషాలు మాత్రమే ఉండే ఈ సినిమా.. చూస్తున్నంతసేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. సినిమా అంతా భయంకరమైన, షాకింగ్ విజువల్స్ ఉంటాయి. మోనాల్ గజ్జర్ తప్పితే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మరో ముఖం లేదు. అయినా సరే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. పిల్లలందరూ యాక్టింగ్ అదరగొట్టేశారు. వీళ్లకు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెడుతుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.

అన్ని ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే ఉన్నాయి. చాలా హింసాత్మక సన్నివేశాలున్నాయి. వాటిలో టీనేజీ పిల్లలు ఉండటం కొందరికి ఇబ్బందిగా అనిపించొచ్చు. సెన్సిటివ్‌గా ఉండేవారు ఈ మూవీ చూడకపోవడమే మంచిది. మొదటి పార్ట్‌లో ఏదైతే స్టోరీ ఉందో దాన్ని అటుతిప్పి ఇటుతిప్పి చూపించినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. మంచి హారర్ సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement