
సోషల్ మీడియా వచ్చాక వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత డేటాను తీసుకొచ్చి సోషల్ మీడియా ఖాతాలో నింపేస్తున్నారు. ఇంకేముంది ఇదే అదునుగా చేసుకున్న కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. సెలబ్రిటీల పేర్లను వినియోగిస్తూ పెద్ద స్కామ్‌లకు తెరతీస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి పేరుతో కొందరు కేటుగాళ్లు స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
కొందరు తన పేరును వాడి డొనేషన్స్ స్వీకరిస్తున్నారని తెలిసింది. దీనిపై ఇప్పటికే నార్సింగ్ పీఎస్ ఫిర్యాదు చేశానని ప్రగతి వెల్లడించింది. నా అభిమానులు దయచేసి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందరూ కూడా చదువుకున్న వాళ్లే ఉన్నారు.. కొంచే మైండ్ పెట్టి ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పలువురు అమౌంట్ పంపి స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేసింది ప్రగతి. ఇప్పటికే చాలామంది డబ్బులు కూడా పంపారని.. చిన్న మొత్తాలు కావడంతో పోలీసులు సైతం చర్యలు తీసుకోవడానికి ఆలస్యం జరుగుతోందని అన్నారు. ఐదు రోజుల క్రితమే చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.