
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ విలక్షణ పాత్రలతో టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. తాజాగా బ్యూటీ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చిత్రంలో తండ్రి పాత్రలో నటించారు. అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లకు హాజరైన నరేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మా అమ్మ తనను నరి అని ముద్దుగా పిలిచేదని వీకే నరేశ్ తెలిపారు. నరి అంటే అరవంలో నక్క అని అర్థం వస్తుందని.. స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా ఫాక్స్ అని పిలిచేవాళ్లని పంచుకున్నారు. మా అమ్మకు బాగా ముద్దొస్తే నారిగా అని పిలిచేదని అన్నారు. నా లైఫ్‌లో నారి అని పిలిచేది మా అమ్మ ఒక్కరే.. ఆమె తప్ప ఎవరూ లేరని చెప్పారు. పవిత్రా లోకేశ్ మేడం మిమ్మల్ని ఎలా పిలుస్తారని ప్రశ్నించగా.. నరేశ్ సమాధానమిచ్చారు. తాను నన్ను చాలా గౌరవంగా పిలుస్తుందని.. రాయా అని పిలుస్తుందని.. అయితే ముద్దుపేరు కింద రాదని నవ్వుతూ మాట్లాడారు.
కాగా.. అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం బ్యూటీ. ఈ మూవీని జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మించారు. ఈ సినిమాకు గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహించారు.