
మహేశ్‌బాబు టాంజానియా వెళ్లనున్నారు. ఆయన హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’(వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ చిత్రీకరణను తొలుత కెన్యాలో ప్లాన్ చేశారు మేకర్స్.
కానీ, ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా, సౌతాఫ్రికాలో చిత్రీకరణను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారట రాజమౌళి. ఆగస్టు రెండో వారంలో చిత్రయూనిట్ టాంజానియా వెళ్లనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
ఇదిలా ఉంటే... ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌పై వర్క్ చేస్తున్నారు రాజమౌళి. ఇందుకోసం రాజమౌళి ఓ ప్రత్యేకమైన స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారట. అలాగే టాంజానియాలో చిత్రీకరించబోయే యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.