ఫార్మా విద్యార్థినికి సోనుసూద్‌ సాయం 

Sonu Sood Assistance To Hyderabad Pharma Student - Sakshi

సాక్షి, ఇబ్రహీంపట్నం: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ తన ఊదారతను మరోసారి చాటుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్‌ ఇనిస్టిట్యూషన్స్‌’లో ఫార్మా సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న దేవికారెడ్డికి ఆర్థిక సాయం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ గ్రామానికి చెందిన దేవికారెడ్డికి గత సంవత్సరం కన్వీనర్‌ కోటాలో ఫార్మా.డి సీటు ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్‌ ఇనిస్టిట్యూషన్స్‌’లో వచ్చింది. ఏడాదికి ఫీజు రూ.లక్షా 15వేలు చెల్లించాలి. చదవండి: (రజనీ కోసం 28 ఏళ్లుగా ఓటు భద్రం..)

అయితే, కన్వీనర్‌ కోటా కావడంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం నుంచి రూ.68వేలు వస్తుంది. మిగతా రూ.47 వేలు కాలేజీకి చెల్లించాల్సి ఉంది. గత సంవత్సరం అతి కష్టం మీద చెల్లించిన దేవికారెడ్డి.. ఈసారి తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. తండ్రి ఫర్టిలైజర్స్‌ షాపులో చిరుద్యోగి, తల్లి గృహిణి. కాగా, సోనూసూద్‌ తన తల్లి పేరుపై ఓ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌ ఇస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత నెల 5న 'సాక్షి' హైదరాబద్‌ సిటీ టాబ్లాయిడ్‌లో 'అమ్మకు ప్రేమతో' శీర్షికనన కథనం ప్రచురితమైంది.

ఈ కథనం చదివిన దేవికారెడ్డి, ట్విటర్లో సోనూసూద్‌కు తన కష్టాన్ని విన్నవించింది. తాను ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు, తమది పేద కుటుంబమని, సాయం చేయాలని కోరింది. ఇదే విషయాన్ని ఆమె 'సాక్షి' ప్రతినిధికి చెప్పగా.. దేవిక వివరాలు సేకరించి సోనూసూద్‌కు సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన సోను.. దేవికారెడ్డికి రూ.47వేలు ఫీజుతో పాటు, రూ.2,500 కలిపి రూ.49,500 చెక్కును యూనివర్శిటీ పేరుపై పంపారు. ఆ చెక్కును సోనూసూద్‌ అభిమాని గౌటే గణేశ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ అశోక్‌కుమార్‌కు అందజేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top