బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సోనాక్షి రోల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నవంబర్ 7న రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లతో బిజీగా ఉన్న బాలీవుడ్ నటి సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు పరిశ్రమలో పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంది.
దక్షిణాది సినీ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలని సోనాక్షి సిన్హా అభిప్రాయం వ్యక్తం చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమలో సమయపాలన పాటిస్తారని తెలిపింది. తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వస్తే సాయంత్రం ఆరు వరకే ఉంటుందని.. ఈ విషయంలో వారిని అభినందించాల్సిందేనని అన్నారు. వారిని చూసి బాలీవుడ్ మేకర్స్ నేర్చుకోవాలని హితవు పలికింది. బాలీవుడ్‌లో అర్ధరాత్రి వరకు షూటింగ్స్ జరుగుతుంటాయని విమర్శించింది. సౌత్‌లా చేయాలంటే క్రమశిక్షణ అవసరమని సోనాక్షి వెల్లడించింది. తెలుగు చిత్ర పరిశ్రమను చూసైనా బాలీవుడ్ మారాలని సలహా ఇచ్చింది.
తన మొదటి తెలుగు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ..' స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. గతంలో నేను (లింగా) ఒక తమిళ సినిమా చేశా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చేశా. ఎల్లప్పుడూ ఇలాంటి చిత్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ అంతకు ముందు నా షెడ్యూల్ కుదరక సినిమాలు ఒప్పుకోలేదు' అని చెప్పింది
ఆ తర్వాత వర్క్ లైఫ్ ప్రస్తావిస్తూ..' హిందీ, తెలుగు సినిమా పని సంస్కృతిని పోల్చి చూస్తే.. దక్షిణది పరిశ్రమలో సమయపాలన గ్రేట్. అక్కడ పని, లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంది. ఈ విషయాన్ని వారి నుంచి మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సెట్‌లోని క్రమశిక్షణ తనకు ప్రత్యేకంగా అనిపించింది. ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వెళ్తే.. ఆరు గంటల తర్వాత అస్సలు షూట్ చేయరు. అది నిజంగా చాలా గ్రేట్. ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణను అంగీకరించాల్సిన విషయం' అని తెలిపింది. కాగా.. జటాధర మూవీలో ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది.


