
'పాడుతా తీయగా' షో గురించి గాయని ప్రవస్తి ఆరాధ్య పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో జడ్జెస్‌గా ఉన్న కీరవాణి, సునీత, చంద్రబోస్‌లు వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్ చేసింది. ఆపై షోలో ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ బాడీ షేమింగ్ వంటి వ్యాఖ్యలతో బాధపెట్టారని ఆమె వాపోయింది. ఆపై సింగర్ సునీతకు పలు ప్రశ్నలతో వీడియో కూడా విడుదల చేసింది. అయితే, ఈ వివాదంపై తాజాగా సింగర్ గీతామాధురి తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా పంచుకుంది.
ప్రవస్తిని ఉద్దేశిస్తూ.. గీత మాధురి ఇలా మాట్లాడింది. 'కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితి కూడా ఇబ్బందులు తీసుకొస్తుంది. ప్రవస్తి చాలారోజులుగా పోటీలో ఉంది. దీంతో కాస్త ఒత్తిడిలో ఉండొచ్చు. ఆమెకు అందరం అండగా ఉంటాం. ఇంతవరకు జరిగిన వాటిని హార్ట్‌కు తీసుకోకు. నీకు తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి. ఇతరులు చేస్తున్న కామెంట్లు అన్నీ నీకు నువ్వే ఆపాదించుకోవద్దు. మేము నీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి షోస్ నుంచే నేను కూడా వచ్చాను. ఒకరి ఒటమిని చూసి చంద్రబోస్ , సునీత, ఎం ఎం కీరవాణి ఎంజాయ్ చేయాలని అనుకోరు. వారికి అందరూ ఒక్కటే. ఒక్కోసారి వారు చేసిన కామెంట్లు ఇబ్బంది పెట్టొచ్చు కానీ, వాటిని మనం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా విజయానికి మెట్లు అనుకోవాలి. ఒక్కోసారి ఎవరు ఏ పాట పాడితే బాగుంటుందని ఎంపిక చేయడంలో మేనేజ్మెంట్ ప్రమేయం ఉంటుంది. ఇలా ఎన్నో డిస్కషన్స్ సెట్స్‌లో అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్లే కన్విన్స్ అయిపోయి వీళ్లకు నచ్చిన పాటలను కూడా పాడనిస్తారు. ఇలాంటివి అన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి.
జడ్జీలుగా ఉన్న ఆ ముగ్గురిలో ఒక్కరూ కూడా.. పలాన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలి అనుకునే వ్యక్తులు కాదు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతే వారు ఈ స్థాయికి వచ్చారు. కానీ, కంటెస్టెంట్ స్థానంలో ఉన్న వారిపై ఒక చిన్న కామెంట్ చేసినా వారికి డిస్టర్బ్‌గా అనిపించడం సహజమే. అదే సమయంలో వారు ఇచ్చే చిన్న కాంప్లిమెంట్ కూడా మళ్లీ మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటివి అన్నీ ఉంటాయి. వాటిని మనకు పాజిటివ్‌గా మలుచుకోవాలి. ఇలాంటి సమయం కోసం ఎదురుచూసిన కొందరు దానిని ఆసరాగా తీసుకొని వారిని తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఎప్పుడు లేని నెగటివిటిని వినాల్సి వస్తుంది. ప్రవస్తీని తిట్టినా.. జడ్జెస్‌ను తిట్టినా నాకు బాధగానే ఉంది. ఇది నా ఒపీనియన్.' అంటూ గీత మాధురి చెప్పుకొచ్చింది.