సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌లకు సీక్వెల్స్‌.. ఆ ఓటీటీలోనే! | Sakshi
Sakshi News home page

OTT: ఫన్‌, హారర్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ల సీక్వెల్స్‌ రాబోతున్నాయ్‌.. ఎక్కడంటే?

Published Thu, Feb 15 2024 1:15 PM

Save The Tigers, Kerala Crime Files, Goosebumps Sequel Announced - Sakshi

సినీ ప్రియులు సినిమాలకే పరిమితం కాకుండా వెబ్‌ సిరీస్‌లకూ ఓటేస్తున్నారు. కొత్త కంటెంట్‌తో రిలీజయ్యే సిరీస్‌లను ఆదరిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సిరీస్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే అలా వచ్చినవాటిలో ఎన్నో హిట్టయ్యాయి కూడా! ఈ క్రమంలో కొన్ని సూపర్‌ హిట్‌ సిరీస్‌లకు సీక్వెల్స్‌ ప్రకటించింది డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌. అవేంటో చూసేద్దాం..

సేవ్‌ ది టైగర్స్‌ 
హాట్‌స్టార్‌లో గతేడాది వచ్చిన తెలుగు వెబ్‌ సిరీస్‌లలో సేవ్‌ ది టైగర్స్‌ ఒకటి. కడుపుబ్బా నవ్వించిన ఈ సిరీస్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయింది. తేజ కాకుమాను దర్శకత్వం వహించగా ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. వీరి భార్యల పాత్రల్లో సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి నటించారు.

హీరోలు ముగ్గురూ ఒక్కో రంగానికి సంబంధించినవారు. కానీ ఈ ముగ్గురూ భార్యా బాధితులే. భార్యల నస వల్ల ఫ్రస్టేషన్‌కు గురవతుంటారు. ఈ క్రమంలో వారి కాపురాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి పరిస్థితుల్లో వీరు ఏం చేశారు? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది రెండో సీజన్‌లో చూపించనున్నారు. ఈ ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది హాట్‌స్టార్‌. త్వరలోనే రెండో సీజన్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2
ఇది పూర్తిగా క్రైమ్‌ సిరీస్‌. గతేడాది కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ రిలీజైంది. ఆషిఖ్‌ ఐమర్‌ అందించిన కథకు అహ్మద్‌ కబీర్‌ దర్శకత్వం వహించాడు. ఒక లాడ్జిలో వేశ్య హత్యకు గురవుతుంది. తనను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతూ హంతకుడి కోసం వెతుకులాట మొదలుపెడతారు.

ఒక ఫేక్‌ అడ్రస్‌ను పట్టుకుని వారు దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఈ మలయాళ సిరీస్‌లో అజు వర్గీస్‌, లాల్‌, షింజ్‌ షాన్‌, సంజు సనిచెన్‌, అశ్వతి మనోహర్‌, నవాస్‌ వల్లికున్ను, దేవకి తదితరులు నటించారు. ఓటీటీలో ఏడు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌ ప్రకటించారు. త్వరలోనే కొత్త కేసుతో కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ 2 రానున్నట్లు వెల్లడించారు.

గూస్‌బంప్స్‌
ఇది ఒక హారర్‌ సిరీస్‌. ఆర్‌.ఎల్‌. స్టీన్‌ రాసిన పుస్తకం ఆధారంగా ఈ అమెరికన్‌ సిరీస్‌ రూపొందించారు. ఇందులో జాక్‌ మారిస్‌, ఇసా బ్రియోన్స్‌, మైల్స్‌ మెకెన్నా, అనయి పుయిగ్‌, విల్‌ ప్రైస్‌, రాచెల్‌ హారిస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాబ్‌ లాటెర్‌మాన్‌, నికోలర్‌ స్టోలర్‌ దర్శకత్వం వహించారు. పది ఎపిసోడ్లతో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

కథేంటంటే.. హైస్కూల్‌ విద్యార్థులు ఓ రోజు పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ 30 ఏళ్ల క్రితం ఓ పిల్లవాడు చచ్చిపోతాడు. ఆ బంగ్లాకు వెళ్లినప్పటినుంచి విద్యార్థుల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఆ బంగ్లాలో ఎన్ని ఆత్మలున్నాయి? వాటితో వీళ్లు ఎలా పోరాడారు? ఎవరు విజయం సాధించారన్నదే గూస్‌బంప్స్‌ స్టోరీ. తాజాగా దీనికి కూడా సీక్వెల్‌ ప్రకటించారు.. త్వరలోనే రెండో సీజన్‌ రానున్నట్లు ప్రకటించింది హాట్‌స్టార్‌. ఇలా ఫన్‌, క్రైమ్‌, హారర్‌ సిరీస్‌లు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయని తెలిసి ఖుషీ అవుతున్నారు ఓటీటీ లవర్స్‌!

చదవండి: విజయ్‌కు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి.. నాకూ రాజకీయాల్లోకి..

 
Advertisement
 
Advertisement