Sakshi News home page

Sarkaaru Noukari Review: ‘సర్కారు నౌకరి’ మూవీ రివ్యూ

Published Mon, Jan 1 2024 8:55 AM

Sarkaaru Noukari Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: సర్కారు నౌకరి
నటీనటులు: ఆకాశ్‌, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు
నిర్మాత:  కె రాఘవేంద్ర రావు
దర్శకత్వం: గంగనమోని శేఖర్‌
సంగీతం: శాండిల్య 
నేపథ్య సంగీతం: సురేష్‌ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ:  గంగనమోని శేఖర్
ఎడిటర్‌: రాఘవేంద్ర వర్మ
విడుదల తేది: జనవరి 1, 2023

ప్రముఖ సింగర్‌ సునీత కొడుకు ఆకాష్‌ గోపరాజు హీరోగా నటించిన తొలి సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరించడంతో చిన్న సినిమా అయినా సరే సర్కారు నౌకరిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేశాయి. కొత్త సంవత్సరం సందర్భంగా నేడు(జనవరి 1, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.



సర్కారు నౌకరి కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1996లో సాగుతుంది. గోపాల్‌(ఆకాష్‌ గోపరాజు) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కష్టపడి చదివి సర్కారు కొలువు(ప్రభుత్వ ఉద్యోగం) సాధిస్తాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ గ్రామానికి హెల్త్‌ ప్రమోటర్‌గా వెళ్తాడు. పెద్దరోగం (ఎయిడ్స్‌)పై అవగాహన కల్పిస్తూ, కండోమ్స్‌ పంచడం అతని డ్యూటీ. సర్కారు నౌకరోడని సత్య(భావన)అతన్ని పెళ్లి చేసుకుంటుంది. గోపాల్ని కొల్లాపూర్‌ గ్రామస్తులు మొదట్లో చాలా బాగా గౌరవిస్తారు.

మండల ఆఫీస్‌లో పనిచేసే సార్‌ భార్య అంటూ సత్యకు కూడా ఊరి ప్రజలు రెస్పెక్ట్‌ ఇస్తారు. కానీ గోపాల్‌ చేసే పని కండోమ్‌లు పంచడం అని తెలిశాక.. ఊరంతా అతని ఫ్యామిలీని అంటరాని వాళ్లుగా పరిగణిస్తారు. బుగ్గలోడు అంటూ గోపాల్‌ని హేళన చేస్తారు. దీంతో అతని భార్య ఉద్యోగం మానేసి.. వేరే ఊరికి వెళ్దామని కోరుతుంది. గోపాల్‌ మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోనని చెబుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి సత్య పుట్టింటికి వెళ్తుంది. మరోవైపు ఊర్లో ఎయిడ్స్‌ వ్యాధి మరింత వ్యాపి​ంచడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవైపు వరుస అవమానాలు..మరోవైపు భార్య గొడవ..అయినా గోపాల్‌ తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయలేదు? పెద్దరోగంపై అవగాహన కల్పించేందుకు గోపాల్‌ ఎం చేశాడు? ఊరి సర్పంచ్‌(తనికెళ్ల భరణి)ని ఎలా వాడుకున్నాడు? ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్యోగాన్నే గోపాల్‌ ఎందుకు ఎంచుకున్నాడు? గోపాల్‌ గతమేంటి? కొల్లాపూర్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సర్కారు నౌకరి చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
1996లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్‌. అప్పట్లో ఎయిడ్స్‌ వ్యాధి ప్రభావం చాలా ఉండేది. సరైన అవగాహన లేక ప్రజలు ఎయిడ్స్‌ బారిన పడేవారు. కండోమ్‌ల వాడకం కూడా తెలిసేది కాదు. వ్యాధి ఎలా వస్తుందో కూడా చాలా మందికి తెలిసేదికాదు. అంటూవ్యాధి అంటూ ఎయిడ్స్‌ బారిన పడిన వారిని ఊరి నుంచి వెలేసేవారు. అలాంటి సంఘటనలు కొల్లాపూర్‌ గ్రామంలో కూడా జరిగాయట. వాటినే కథగా మలుచుకొని సర్కారు నౌకరి చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఓ మంచి సందేశాన్ని కామెడీ, భావోద్వేగాలు రెండింటిని జొప్పించి కమర్శియల్‌ అంశాలను బ్యాలెన్స్‌ చేస్తూ కథను తెరకెక్కించాడు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సహజంగా కథనం సాగుతుంది.

అయితే ఇప్పుడున్న ప్రేక్షకుల మూడ్‌కి పూర్తి విరుద్ధమైన కథ ఇది. ప్రస్తుతం ప్రేక్షకులంతా యానిమల్‌, సలార్‌ లాంటి యాక్షన్‌ చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సర్కారు నౌకరిలో అలాంటి సన్నివేశాలేవి ఉండవు. కానీ గ్రామీణ నేటివిటీ, మన చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు తెరపై కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. ఫస్టాఫ్‌ అంతా చాలా కామెడీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల పెళ్లి, రొమాన్స్‌.. అప్పట్లో పూర్లో ఉండే పరిస్థితులు, జనాల ప్రవర్తన ఇవన్నీ కాస్త నవ్వులు పంచుతాయి. ఇంటర్వెల్‌ సీన్‌ ఎమోషనల్‌గా టచ్‌ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. గంగ(మధులత)-శివ(మహదేవ్‌)ల మధ్య వచ్చే సన్నివేశాలు..​పాట ఆకట్టుకుంటుంది. అలాగే శివ పాత్ర ముగింపు, హీరో ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌  కూడా గుండెల్ని పిండేస్తుంది. అయితే కథనం చాలా సహజంగా, చాలా ఎమోషనల్‌గా సాగినా..ప్రేక్షకులను ఫీల్‌ అయ్యేలా చేయడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎయిడ్స్‌పై అవగాహన కల్సించడం కోసం హీరో చేసే ప్రయత్నాల్ని తెరపై బలంగా చూపించలేకపోయాడు.కొన్ని చోట్ల కథనం స్లోగా సాగుతూ ఆర్ట్‌ ఫిల్మ్స్‌ని గుర్తు చేస్తుంది. అయితే దర్శకుడు మాత్రం చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. గ్రామీణ నేపథ్య చిత్రాలను ఇష్టపడేవారికి, నైంటీస్‌ జనరేషన్‌ వాళ్లకి సర్కారు నౌకరి నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
సింగర్‌ సునీత కొడుకు ఆకాశ్‌ తొలి సినిమా ఇది. అయినా చాలా చక్కగా నటించాడు.తన పాత్రకు తగ్గట్టుగా హవభావాలను పలికించాడు. ఎమోషనల్‌ సన్నివేశాలల్లో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అనుభవలేమి కనిపించినా..మున్ముందు మంచి నటుడిగా రాణించే అవకాశం ఉంది. గోపాల్‌ భార్య సత్యగా భావన తనదైన నటనతో ఆకట్టుకుంది. గోపాల్‌ స్నేహితుడు శివగా మహదేవ్‌, అతని మరదలు గంగగా మధు లత తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక కొల్లాపూర్‌ సర్పంచ్‌గా తనికెళ్ల భరణి తన మార్క్‌ హాస్యంతో కొన్ని చోట్ల నవ్వించాడు. బలగం సుధాకర్‌ రెడ్డి, సాహితి దాసరి, సమ్మెట గాంధీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక విషయాలకొస్తే..  సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగుంది. శాండిల్య పాటలు ఆకట్టుకుంటాయి.శేకర్‌ గంగనమోని కెమెరా వర్క్‌ బాగుంది. అప్పటి పల్లెటూరి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

Rating:
Advertisement

What’s your opinion

Advertisement