
టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సీఎం సహాయక నిధికి విరాళాన్ని అందించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా కామారెడ్డి సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇలాంటి సమయంలో తన వంతుగా సాయం చేసేందుకు దర్శకుడు సందీప్‌రెడ్డి ముందుకు రావాడాన్ని తన అభిమానులు సంతోషిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని సందీప్‌రెడ్డి వంగాతో పాటు తన సోదరుడు ప్రణయ్ రెడ్డి కలుసుకున్నారు. భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయక నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా టాలీవుడ్ నుంచి ఎవరూ స్పందించలేదు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటన జరిగితే కోట్ల రూపాయలు ఇచ్చే టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు తెలంగాణ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఆపద వస్తే స్పందించరా అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. వరంగల్‌కు చెందిన సందీప్‌రెడ్డి వంగా చేసిన సాయంతో అయినా మరికొందరు ముందుకు వస్తారని నెటిజన్లు ఆశిస్తున్నారు.