ఇంట గెలిచి.. రచ్చ గెలవడానికి వచ్చారు

Sakshi Special‌ Story On Other State Heroines In Tollywood

తమిళ పొన్ను (అమ్మాయి), కేరళ కుట్టి (అమ్మాయి).. భాష ఏదైనా తెలుగమ్మాయిలా కనిపించడానికి రెడీ అయిపోతారు.  తెలుగు అమ్మాయిలు అక్కడికి వెళుతున్నారు. అక్కడి అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న పరభాషా నాయికల్లో కొందరు ఇంట గెలిచారు.. రచ్చ గెలవడానికి వచ్చారు.  ఈ తారలపై స్పెషల్‌ స్టోరీ.

ఎమోషనల్‌... కామెడీ... రొమాంటిక్‌.. లవ్‌... ఇలా సీన్‌ ఏదైనా అద్భుతంగా నటిస్తారు మలయాళ నటి నజ్రియా నజీమ్‌. ‘నిరమ్‌’ (2013), ‘బెంగళూరు డేస్‌’ (2014) వంటి మలయాళ మూవీస్‌లోనే కాదు...‘రాజా రాణి’ (2013) వంటి తమిళ సినిమాలో కూడా నటించారు నజ్రియా. మాలీవుడ్‌లో వన్నాఫ్‌ ది టాప్‌ హీరోయిన్స్‌గా ఉన్న నజ్రియా ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్న ‘అంటే...సుందరానికీ!’ సినిమాలో ఈ మలయాళ సుందరి హీరోయిన్‌గా నటించనున్నారు. నజ్రియా చేస్తున్న తొలి స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ఇదే. కేవలం నటిగానే కాదు... తన భర్త, హీరో ఫాహద్‌ ఫాజిల్‌తో కలిసి నిర్మాతగా కూడా మాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు నజ్రియా. 


నజ్రియా నజీమ్‌ 

బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి హీరోయిన్‌గా సక్సెస్‌ అయినవారిలో  ప్రియాభవానీ శంకర్‌ ఒకరు. ప్రస్తుతం అరడజను తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్‌ దక్కించుకున్నారు ప్రియ. మంచు మనోజ్‌ హీరోగా నటించనున్న ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌కి సైన్‌ చేశారామె. ప్యాన్‌ ఇండియా స్థాయిలో శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో పాటుగా తెలుగులో మరో కొత్త సినిమా చేయడానికి కూడా ప్రియ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.


ప్రియా భవానీ శంకర్‌ 

మరో మలయాళ భామ ఐశ్వర్యా లక్ష్మీ మాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్నారు. మోడలింగ్‌ నుంచి యాక్టింగ్‌ వైపు వచ్చిన ఈ బ్యూటీకి మాలీవుడ్‌లో చాన్సులు క్యూ కడుతున్నాయి. బ్రదర్స్‌ డే, వరదన్‌ వంటి మలయాళ సినిమాలు చేసిన ఐశ్వర్య తమిళంలో విశాల్, తమన్నా నటించిన ‘యాక్షన్‌’ సినిమాలో కూడా ఐశ్వర్య ఓ కీ రోల్‌ చేశారు. ఇప్పుడు తెలుగులో హీరోయిన్గా‌ పరిచయం కాబోతున్నారు.

‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత హీరో సత్యదేవ్, డైరెక్టర్‌ గోపీ గణేష్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘గాడ్సే’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక మరో మలయాళీ భామ ఐశ్వర్యా మీనన్‌ తమిళంలో సిద్ధార్థ్, అమలాపాల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి’ (తెలుగులో ‘లవ్‌ ఫెయిల్యూర్‌’గా విడుదలైంది) సినిమా ద్వారా నటిగా ప్రయాణం ప్రారంభించారు. తమిళంతో పాటు ఇప్పుడు కన్నడ సినిమాలూ చేస్తున్నారామె.


ఐశ్వర్యా లక్ష్మి 

తాజాగా రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా నటించే చాన్స్‌ను ఐశ్వర్యా మీనన్‌ దక్కించుకున్నారని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నారు. ‘పెళ్లిసందడి’ సినిమా సీక్వెల్‌లో హీరోయిన్‌గా చేస్తున్నారు శ్రీలీల. తెలుగులో శ్రీలీలకు హీరోయిన్‌గా ఇది తొలి సినిమా. ఇక కన్నడలో ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్న నటి రచితా రామ్‌. ఉపేంద్ర, శివరాజ్‌కుమార్‌ వంటి శాండిల్‌వుడ్‌ టాప్‌ స్టార్స్‌ సరసన నటించారామె. ప్రస్తుతం కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పులి వాసు డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘సూపర్‌ మచ్చీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు రచితా. వీరితో పాటు మరికొంతమంది తమిళ, మలయాళ, కన్నడ హీరోయిన్స్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top