– ఎల్‌బీ శ్రీరామ్
నవరసాలతో రంజింపచేసేదే సినిమా. ఆ నవరసాల్లో హాస్యరసం అందరికీ ప్రియం, ప్రత్యేకం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రేక్షకుల మదిలో పదిలంగా సుస్థిర స్థానం సంపాదించుకున్న హాస్యనటులు ఎందరో ఉన్నారు. వారిలో లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ప్రముఖులు. సినీ ప్రేక్షకులకు ఎల్‌బీ శ్రీరామ్ పేరిట ఆయన సుపరిచితులు.
1952 మే 30న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆయన దాదాపు నలభైకిపైగా చిత్రాలకు రచయితగా, 500 పైచిలుకు సినిమాల్లో నటుడుగానూ ప్రేక్షకులను అలరించారు. నేడు ఎల్‌బీ శ్రీరామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాక్షి డిజిటల్ టీమ్ ఆయన్ని ప్రత్యేకంగా పలకరించింది. ఆయన సినీ, వ్యక్తిగత అనుభవాలతో మొత్తం అరగంటకుపైగా నిడివి ఉన్న కార్యక్రమంలో ఆయన ఇంటర్వ్యూ రొటీన్‌కు భిన్నంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి డిజిటల్ యూట్యూబ్ ఛానల్‌లో ఆత్మీయంగా పేరిట నేటి నుంచి చూడగలరు. ఎల్‌బీ శ్రీరామ్ ఆత్మీయంగా పంచుకున్న అనుభవాల్లో కొన్ని ఇలా...
బ్యాక్ బెంచ్ అయినా క్లాస్ టాపర్‌ని...
‘‘నేను బాల్యంలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయినా ఎప్పుడూ క్లాస్ టాపర్‌గా ఉండేవాడిని. చిన్నప్పుడు అందరితో పెద్దగా కలిసేవాడిని కాదు.. బాగా మొహమాటం. సినిమా నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఉండడానికి సినిమానే కారణం. మరీ ముఖ్యంగా దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణగారు నాకు మంచి స్వేచ్ఛ ఇచ్చి రచయితగానే గాక మంచి అవకాశాలు ఇచ్చి నటుడిగానూ ప్రోత్సహించారు. ఆయన జీవితంలో ‘అప్పుల అ΄్పారావు, అమ్మో ఒకటో తారీఖు, హలో బ్రదర్, ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి చిత్రాలు అద్భుతం.
సినీ పరిశ్రమలో నాకు శత్రువులు ఎవరూ లేరు.. ఉన్నవారంతా మిత్రులే. ఇప్పుడున్న జెన్ జీ తరం స్పీడ్ అందుకోలేనంత వేగంగా ఉంది.. మరి రేపటి తరం ఇంకెంత వేగంగా ఉంటుందో! కాకపోతే నేటి కామెడీ పోకడే కాస్తంత వెరైటీగా ఉంది. వేసిన జోక్ అర్థం చేసుకునేలోపు బ్యాక్ గ్రౌండ్‌లో నవ్వుల సౌండ్ వినిపించేస్తోంది.. దీంతో అది విని నవ్వాలో, నవ్వకూడదో అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఏది ఏమైనా సినిమా ప్రపంచం చిన్నదే కానీ దాని స్పందన మాత్రం అనూహ్యం’’ అని ఎల్‌బీ శ్రీరామ్ అన్నారు. తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను నేటికీ అలరిస్తున్న ఎల్‌బీ శ్రీరామ్‌కి ‘సాక్షి’ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
– హరికృష్ణ ఇంటూరు


