
మహేష్ హీరోయిన్ వ్యాఖ్యల సంచలనం.. ఆ తర్వాత?
సెలబ్రిటీల వ్యాఖ్యలు ఇటీవల రేపుతున్నంత దుమారం మరేవీ రేపడం లేదనేది వాస్తవం. విభిన్న రకాల మాధ్యమాలు అందుబాటులోకి రావడం, వాటిలో వారు తమ అభిప్రాయాలను పంచుకోవడం, అనేక వేదికల మీద ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు.. వాటిలో ఏ కాస్త తేడా ఉన్నా అవి స్వల్ప కాలంలోనే వైరల్ అయి ఆ సెలబ్రిటీల గొంతులో పచ్చి వెలక్కాయలా మారడం చూస్తూనే ఉన్నాం.
అదే విధంగా ఇటీవల మరో సెలబ్రిటీ చేసిందంటూ వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలు పెను సంచలనం కలిగించాయి. సంప్రదాయాలకు, నైతికతకు విలువిచ్చే భారతీయుల మనోభావాలు గాయపడే విధంగా మాజీ మిస్ వరల్డ్ ప్రస్తుత హాలీవుడ్ నటి, పాశ్చాత్యుడిని పెళ్లాడిన ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారంటూ వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన రాజమౌళి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ మధ్య ఆమె ‘కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుంది, కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయి‘ కాబట్టి మగవాళ్లు కన్యల కోసం వెదకి వేసారి పోవాల్సిన అవసరం లేదనీ మనిషిగా పరస్పర మర్యాదలు ముఖ్యం అంటూ ఆమె చేసిందన్న వ్యాఖ్యల్ని అనేక మాధ్యమాలు హైలెట్ చేశాయి.
సహజంగానే ఈ వ్యాఖ్యలు చాలా త్వరగా వైరల్ కావడంతో విపరీతమైన దుమారం చెలరేగింది. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచీ పాశ్చాత్య పోకడల్ని ఇష్టపడే వ్యక్తిగా ప్రియాంక చోప్రా కు ఉన్న పేరు ఈ వ్యాఖ్యలు ఆమే చేసిందంటూ అత్యధికులు నమ్మేందుకు కూడా దోహదం చేసింది. గత కొంత కాలంగా ప్రియాంక మన బాలీవుడ్ సినిమాల కంటే ..హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుండడం వంటివి కూడా దీనికి కొంత వరకూ కారణం. ఈ నేపధ్యంలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ చిచ్చు రాజుకున్న కొన్ని రోజుల తర్వాత తీవ్రత గమనించిన ప్రియాంక నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె ఖండించారు. ఆ మాటలు తనవి కాదంది, ‘ఏదైనా సరే ఆన్లైన్లో ఉన్నంత మాత్రాన అది నిజం కాదు‘ అని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను ఖండించారు. తనదిగా సూచించే ఈ కోట్ నకిలీదని వైరల్ కావడానికి పన్నిన వ్యూహమని ఆమె ఇన్స్ట్రాగామ్‌లో స్పష్టం చేసింది. ఇలా వైరల్ అయ్యేందుకు కూడా కల్పిత కంటెంట్ సృష్టిస్తున్నారని ఆన్లైన్ విశేషాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు దాన్ని థృవీకరించుకోవాలని చోప్రా తన అభిమానులను కోరారు.