
‘‘ఓ సినిమా తీసి, దాన్ని రిలీజ్ చేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్లడం పెద్ద టాస్క్. అయితే ఈ జర్నీ ఎంత కష్టమైనా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నమ్మకం గురించిన కథ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమా. లైట్ హార్టెడ్ కామెడీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి... మంచి అనుభూతినిస్తుంది’’ అని అన్నారు ప్రవీణ పరుచూరి. మనోజ్ చంద్ర, మోనికా .టి, ఉషా బోనేలా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. రానా సమర్పణలో ప్రవీణ పరుచూరి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో మనోజ్ చంద్ర మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేను పోషించిన రామకృష్ణ పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి మరిన్ని సినిమాలకు రానాగారు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చాలా మంచి సినిమా ఇది. థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అన్నారు టి. మోనిక, ఉషా బోనేలా. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ మెహరా బాబా మాట్లాడారు.