Sakshi News home page

కొత్త పార్లమెంట్‌పై షారుఖ్‌, అక్షయ్‌ ట్వీట్‌.. స్పందించిన ప్రధాని మోదీ

Published Sun, May 28 2023 5:25 PM

PM Modi Reacts Shah Rukh Khan, Akshay Kumar Tweet On Parliament Building Video - Sakshi

పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్‌ చేశారు. వీరిలో షారుఖ్‌ ఖాన్‌, రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌లు చేసిన ట్వీట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిప్లై ఇచ్చారు. భారత నూతన పార్లమెంటు భవనానికి సంబంధించిన ఓ  వీడియోను మే 26న ట్విటర్‌లో షేర్‌ చేశాడు మోదీ. అందులో కేవలం నేపథ్య సంగీతం మాత్రమే ఉంది. దానికి వాయిస్‌ ఓవర్‌ చేసి పంపాలని కోరారు. 

పార్లమెంట్‌ భవనం గురించి తమ అభిప్రాయాలు పంచుకోవాలన్నారు.  మోదీ పిలుపు మేరకు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ తమ వాయిస్-ఓవర్‌తో నూతన పార్లమెంటు భవనం వీడియోను ట్విటర్‌‌లో షేర్ చేశారు. మోదీ వీటిని రీట్వీట్ చేశారు. షారుఖ్ తన వాయిస్ ఓవర్‌లో నూతన పార్లమెంటు భవనం మన ఆశల సౌథమని, మన రాజ్యాంగాన్ని బలపరిచేవారి నివాసమని తెలిపారు. ఇక్కడ 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా నిలుస్తారన్నారు.

‘గ్రామాలు, పట్టణాలు ,మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ఈ కొత్త పార్లమెంట్‌లో తగిన స్థానం ఉంటుంది. ఇక్కడ సత్యమేవ జయతే అనే నినాదం స్లోగన్‌ కాదు..విశ్వాసం’ అంటూ షారుఖ్‌ చెప్పుకొచ్చాడు. షారుఖ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించిన ఈ వీడియోని ప్రధాని మోదీ రీట్వీట్‌ చేశాడు. ‘అద్భుతంగా వివరించారు. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రజా స్వామ్య బలానికి, ప్రగతికి ప్రతీక’అని మోదీ రాసుకొచ్చాడు. 

ఇక పార్లమెంటు నూతన భవనాన్ని చూడటం గర్వకారణమని అక్షయ్ కుమార్ ట్వీట్‌ చేశాడు. దేశ అభివృద్ధికి విశిష్ట చిహ్నంగా ఇది ఎల్లప్పుడూ నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అక్షయ్ కుమార్ ట్వీట్‌ను నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ.. ‘మీ ఆలోచనలను చాలా బాగా వెల్లడించారు’ అని ప్రశంసించారు. నూతన పార్లమెంటు భవనం మన ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి అని మోదీ ట్వీట్‌ చేశాడు.

Advertisement

What’s your opinion

Advertisement