‘పిండం’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Pindam Review: ‘పిండం’ మూవీ రివ్యూ

Published Fri, Dec 15 2023 9:16 AM

Pindam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: పిండం
నటీనటులు: శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్‌, రవివర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: కళాహి మీడియా బ్యానర్‌
నిర్మాత: యశ్వంత్‌ దగ్గుమాటి
దర్శకత్వం: సాయికిరణ్ దైదా
సంగీతం: కృష్ణ సౌరభ్‌ సూరంపల్లి
సినిమాటోగ్రఫీ: సతీష్‌ మనోహర్‌
విడుదల తేది: డిసెంబర్‌ 15, 2023

కథేంటంటే..
క్రైస్తవ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్‌) రైస్‌ మిల్లులో ఓ అకౌంటెంట్‌. భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి  సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటాడు. అది పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు ఆంథోని. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆంథోని ప్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి. గర్భవతిగా ఉన్న భార్య మేరి ఆస్పత్రి పాలవుతుంది. మూగదైన చిన్నకూతురు తారను ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఆ ఫ్యామిలీని చంపేందుకు క్షుద్రశక్తులు ప్రయత్నిస్తాయి.

అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి అన్నమ్మ(ఈశ్వరీరావు) రంగంలోకి దిగుతుంది. ఆంథోని ఫ్యామిలీని వేధిస్తుంది ఒక ఆత్మ కాదని..ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని అన్నమ్మ గుర్తిస్తుంది. అసలు ఆ  ఆత్మల కథేంటి? వాళ్లు ఎలా చనిపోయారు? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆ ఇంట్లో అంతకు ముందు ఏం జరిగింది? ఆ ఇంటి నుంచి ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ ఏం చేసింది? చిన్న కూతురు తారను ఆవహించిన ఆత్మను విదిలించేక్రమంలో అన్నమ్మకు ఎదురదైన సమస్యలు ఏంటి? చివరకు ఆంథోని ఫ్యామిలీని అన్నమ్మ ఎలా రక్షించింది? 1932లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునేందుకు లోక్‌నాథ్‌(అవసరాల శ్రీనివాస్‌)ఎందుకు ఆసక్తి చూపాడు? అనేది తెలియాలంటే ‘పిండం’సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
హారర్‌ చిత్రాలు అంటే భయపెట్టాలి. కానీ ఈ మధ్యకాలంలో హారర్‌ అంటే కామెడీనే అనేలా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. హారర్‌ జానర్‌ అని చెప్పి కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తూ ప్రేక్షకులను భయపెట్టడం పక్కకి పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఓ ట్రూ హారర్‌ ఫిల్మ్‌గా పిండం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, హరర్‌ ఎలిమెంట్స్‌తో పాటు  చైల్డ్ సెంటిమెంట్ అంశాలతో దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. అలా అని ఇది కొత్త కథ కాదు.. చాలా సన్నివేశాలు ఇతర హారర్‌ సినిమాల్లో చూసినవే ఉంటాయి.  కానీ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశాడు. 

ఈ కథ 1992లో ప్రారంభమై.. 1932లో సాగుతుంది. ఓ భయంకరమైన సన్నివేశంతో అన్నమ్మ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కేస్‌ స్టడీ అంటూ లోక్‌నాథ్‌ రావడం..అన్నమ్మ గురించి తెలుసుకునే క్రమంలో కథ 1932లోకి వెళ్తుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆంథోనీ ఫ్యామిలీ ‘నాయుడమ్మ’ఇంట్లోకి రావడంతోనే ఇంట్లోనే దెయ్యం ఉంటుందని ప్రేక్షకులను అర్థమై పోతుంది.

అయితే అసలు ఆ దెయ్యం కథేంటి? అది ఎవరిని ఆవహించదనే సస్పెన్స్‌ మాత్రం ఇంటర్వెల్‌ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆంథోని ఫ్యామిలోని ప్రతి వ్యక్తిపై అనుమానం కలిగించేలా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో చాలా చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇక్కడ ఏదో జరగబోతుంది అనే విషయం ప్రేక్షకుడికి తెలిసినప్పటికీ.. సీన్‌ ఎండింగ్‌లో భయపడిపోతాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రొటీన్‌గా ఉంటాయి. 

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం కథనం సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఆత్మలను తొలగించేందుకు అన్నమ్మ చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు.  ఫ్లాష్‌ బ్యాక్‌ స్టోరీ మాత్రం గుండెలను పిండేస్తుంది.  దర్శకుడి సాయి కిరణ్‌కి ఇది తొలి సినిమానే అయినా.. కొన్ని సన్నివేశాలను మాత్రం ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తీర్చిదిద్దాడు. హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి పిండం నచ్చుతుంది.కథ రొటీన్‌గా ఉన్నా.. కొన్ని సన్నివేశాలను మాత్రం భయపెడతాయి. 

ఎవరెలా చేశారంటే.. 
డిఫరెంట్‌ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో శ్రీరామ్‌ ఆకట్టుకున్నాడు. అయితే ఇందులో ఆయన హీరోయిజం చూపించే సన్నివేశాలేవి లేవు. ఎమోషన్‌ సీన్లను చక్కగా నటించాడు. ఇక  మేరీగా ఖుషి రవి ఓ డిఫరెంట్‌ పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం గర్భవతిగానే కనిపిస్తుంది. అయితే ఆమెకు కథలో బలమైన సన్నివేశాలేవి లేవు. అన్నమ్మగా ఈశ్వరిరావు  అద్భుతంగా నటించింది.

కథ మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది. సోఫియా, తారలుగా నటించిన ఇద్దరు చిన్న పిల్లలు సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తారగా నటించిన చిన్నారి నటన భయపెడుతుంది. లోక్‌నాథ్‌గా అవసరాల శ్రీనివాసరావు తన పాత్ర పరిధిమేర నటించాడు. టెక్నికల్‌ విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కృష్ణ సౌరభ్‌ సూరంపల్లి సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
Advertisement