టైటిల్ : ఫస్ట్ టైం
నటీనటులు: సౌరబ్ ధింగ్ర, అఖిల్ సార్థక్, అనిక్క విక్రమన్,గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం తదితరులు
నిర్మాత: హేమంత్ ఇప్పలపల్లి
రచన-దర్శకత్వం: హేమంత్ ఇప్పలపల్లి
సంగీతం: శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్
సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్, రామ్
విడుదల తేది: మే 22, 2026
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరభ్ ధింగ్ర హీరోగా పరిచయమైన తెలుగు సినిమా 'ఫస్ట్ టైం'. హేమంత్ ఇప్పలపల్లి.. దర్శక నిర్మాతగా వ్యవహరించారు. 'బిగ్‌బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్ర చేశాడు. అనిక విక్రమన్ హీరోయిన్. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించారు. వీఎఫ్ఎక్స్ ఆధారంగా తీసిన ఈ మూవీ నేడు (మే 22) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)
కథేంటి?
2304 ఏడీలో ఏలియన్స్‌తో మొదలయ్యే ఈ సినిమా.. అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది? కొత్త భారతదేశం ఎలా తయారైంది అనే పాయింట్‌తో తెరకెక్కించారు. ఏలియన్లకు అప్పటి మానవులు ఈ కలియుగంలో జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ ఉంటారు. ఆద్య(అనికా విక్రమన్) ఇంజనీరింగ్ చదువుతుంటుంది. అదే కాలేజీలో చదువుతున్న రాహుల్(శివ కుమార్) ఎలాగైన ఆమెకు దక్కించుకోవాలనుకుంటాడు. మరోవైపు ఆద్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె బావ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అతనితో బలవంతంగా ఎంగేజ్‌మెంట్ జరిపిస్తారు. సోల్‌మేట్ దొరికితే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చని ఆద్య ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆమెకు ఆది(అఖిల్ సార్థక్) పరిచయం అవుతాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయం ఆద్య బావకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రేమించిన ఆద్యను ఆది ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? భూమి మీద ఉన్న మనుషులంతా ఎందుకు చనిపోతుంటారు? ఆద్య, ఆదిలు మాత్రమే ఎలా బతుకుతారు? ఏలియన్స్‌కి ఈ కథలో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో సౌరభ్ ధింగ్రని పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇదొక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ సినిమా. 2304లో అంటే దాదాపు 300 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న కలియుగం అంతం అయితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు మళ్లీ మానవజాతిని సృష్టించడానికి భారతీయులు..అందులోనూ మన తెలుగువాడు కారణం అయితే ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ అద్భుతంగా ఉంది. కానీ దాన్ని తెరపై చూపించడంతో మాత్రం కాస్త తడబడ్డాడు. ఒకవైపు ఏలియన్లు, సైంటిస్టుల ప్రయోగాలు, మరోవైపు ఆద్య జీవితంతో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఫస్టాఫ్ కాస్త గందరగోళంగా ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉండడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. అసలు కథ ఏంటి అనేది సెకండాఫ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే..
హీరోగా పరిచయమైన సౌరభ్ ధింగ్రకి ఇదే తొలి సినిమా అయినా సరే బాగానే చేశాడు.అనికా విక్రమన్ నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భూపాల్ రాజు శివకుమార్‌గా అఖిల్ సార్థక్ పర్లేదనిపించాడు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా కూడా ఓకే. సాంకేతికగా సినిమా బాగుంది. ఈ సినిమాలో ఏఐ ఉపయోగించకుండా హ్యూమన్ ఇంటలిజెన్స్ మాత్రమే వాడడం ప్రత్యేకం. దర్శకనిర్మాత హేమంత్ ఇప్పలపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. గతంలో విఎఫ్ఎక్స్ అనుభవం ఉండటంతో హేమంత్ చక్కగా తీశారు. వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ వెంకట్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ పర్లేదనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
(ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


