విష్ణు విశాల్ హీరోగా సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్యన్’. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం ఈ చిత్రం నుంచి ‘పరిచయమే పదనిసలా...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. విష్ణు విశాల్, మానసా చౌదరి మధ్య ఈ పాట సాగుతుంది. వీరి పరిచయం ప్రేమకు దారి తీయడం నుంచి పెళ్లి చేసుకునే వరకూ... అంతా ఈ పాటలో కనిపించింది.
ప్రవీణ్ .కె దర్శకత్వంలో శుభ్రా, ఆర్యన్ రమేశ్, విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. లవ్ మెలోడీ సాంగ్ ‘పరిచయమే...’కు సామ్రాట్ సాహిత్యం అందించగా, అభి .వి, భృత్త ఆలపించారు. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి విడుదల చేయనున్నారు.


