లేఖ పాత్రలో అలరించనున్న శివాత్మిక

Panchathantram First Look Release - Sakshi

‘దొరసాని’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన జీవితా రాజశేఖర్‌ల చిన్న కుమార్తె శివాత్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘పంచతంత్రం’. గురువారం శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. హీరో అడివి శేష్‌ టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేసి, నటీనటుల వివరాలు వెల్లడించారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, రాహుల్‌ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. కొంత గ్యాప్‌ తర్వాత స్వాతి నటిస్తున్న చిత్రం ఇది. నటిగా ఆమెకిది కమ్‌బ్యాక్‌ అనొచ్చు. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అఖిలేష్‌ వర్ధన్‌ , సృజన్‌  ఎరబోలు నిర్మిస్తున్నారు.

సృజన్‌  మాట్లాడుతూ– ‘‘దొరసాని’లో తన నటనతో ఆకట్టుకున్న శివాత్మిక మా సినిమాలో లేఖ పాత్రలో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ దర్శకుడు సందీప్‌ రాజ్‌ మాటలు రాశారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా, హ్యాపీగా ఉంది’’ అన్నారు శివాత్మిక. ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాల చుట్టూ (చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన) అల్లుకున్న కథతో ఈ సినిమా ఉంటుంది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి’’ అన్నారు హర్ష. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ కె. నల్లి, లైన్‌ ప్రొడ్యూసర్‌: సునీత్‌ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌  సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, సహ నిర్మాతలు: రమేష్‌ వీరగంధం, రవళి కలంగి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top