ప్రముఖ గాయకుడు మృతి.. పద్మశ్రీ అవార్డు అందుకోకుండానే విషాదం | Padma Shri Awardee Dhrupadacharya Pandit Laxman Bhatt Tailang Passed Away At Age Of 93 - Sakshi
Sakshi News home page

ప్రముఖ గాయకుడు మృతి.. పద్మశ్రీ అవార్డు అందుకోకుండానే విషాదం

Published Sun, Feb 11 2024 2:05 PM

Padma Shri Dhrupad Acharya Pandit Laxman Bhatt Tailang Passed Away - Sakshi

భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ (93) మరణించారు.  కొద్దిరోజుల క్రితం జనవరి 26వ తేదీన భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి కొద్ది రోజుల ముందు పండిట్ తైలాంగ్ మరణించారు.

నేషనల్‌ మీడియా కథనాల ప్రకారం పండిట్ తైలాంగ్ న్యుమోనియాతో పాటు ఇతర వ్యాధులతో చికిత్స పొందుతూ జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ వార్తను ధృవీకరిస్తూ, పండిట్ తైలాంగ్ కుమార్తె, స్వయంగా ప్రఖ్యాత ధృపద్ గాయని అయిన ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ ఇలా అన్నారు, "గత కొన్ని రోజులుగా నాన్నగారి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం దుర్లభ్‌జీ ఆసుపత్రిలో చేర్పించాం. చికిత్స సమయంలోనే ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.' అని తెలిపారు. 

జైపూర్‌కు చెందిన పండిట్ లక్ష్మణ్ భట్  తన జీవితమంతా సంగీత సాధనకు అంకితం చేశారు. ఇందులో తన పిల్లలతో పాటు అనేక మంది విద్యార్థులకు విస్తృతమైన జ్ఞానం, విద్యను అందించాడు. ఆయన తన కుమారుడు రవిశంకర్‌తో పాటు కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తిలను వివిధ సంగీత కళా ప్రక్రియలలో ప్రావీణ్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించారు.

బనస్థలి విద్యాపీఠ్, రాజస్థాన్ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా ఆయన పనిచేశారు.  1985లో జైపూర్‌లో 'రసమంజరి' పేరుతో ఒక సంగీతోపాసు కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగానే విద్యను అందించారు. 2001లో జైపూర్‌లో 'అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్'ని స్థాపించి చాలామందికి సాయం అందించారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు అందుకోకుండానే ఆయన మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు.
 

Advertisement
Advertisement