
ఆస్కార్ అంటే రాజమౌళి గుర్తొస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
‘‘కంటెంట్ క్రియేటర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనుషులను మనం రోబోలుగా మార్చకూడదు. వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలి. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చు. కంటెంట్ క్రియేటర్లనుప్రోత్సహిస్తాం. భారత్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారుతోంది. అలాగే ఆరెంజ్ ఎకానమీకి (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) దేశంలో నాంది పడింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం. కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్ అనేవి ఆరెంజ్ ఎకానమీకి మూడు స్తంభాలు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ని గురువారం ప్రారంభించారు నరేంద్ర మోదీ. క్రియే టివ్ ఎకానమీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ మీడియా ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ)ని దాదాపు రూ. 400 కోట్లతో ముంబైలో స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘వేవ్స్’లో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఫర్హాన్ అక్తర్, నాగ చైతన్య– శోభిత ధూళిపాళ, రాజ్ కుమార్ రావు, కబీర్ బేడీ, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, శ్రీలీల, పలువురు దక్షిణాది ఫిలిం చాంబర్ ప్రముఖులు పాల్గొన్నారు.
‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 100కి పైగా దేశాల నుంచి 10,000 మంది డెలిగేట్స్, 1,000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ‘వేవ్స్’ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా ఘోషల్, మంగ్లీ, లిప్సిక బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహూతులను అలరించింది.
ఈ వేదికపై ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ– ‘‘సృజనాత్మకతనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్’ అవార్డులను కూడా ప్రతిష్ఠాత్మకంగా అందించనున్నాం. ఇప్పుడు క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్ సమయం. ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో భారత కథలు గ్లోబల్ రీచ్‌ని సాధిస్తున్నాయి. భారత సినిమాలు 100కిపైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయి.
భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి ఆస్కార్ దక్కడమే అందుకు నిదర్శనం. రష్యాలో రాజ్ కపూర్ చిత్రాలు పాపులర్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సత్యజిత్ రే పేరు, ప్రతిష్ఠలు గుర్తొస్తాయి. ఆస్కార్ అనగానే ఏఆర్ రెహమాన్, రాజమౌళి (‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ప్రస్తావించి) గుర్తొస్తారు. ఇటీవల 50 దేశాల గాయకులు కలిసి ‘వైష్ణవ జనతో’ అనే గీతాన్ని ఆలపించారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి’’ అని పేర్కొన్నారు.
‘‘బాల్యంలో నేనెక్కువగా డ్యాన్సులు చేసేవాడిని. అలా నటనపై ఆసక్తి మొదలైంది. చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుగార్లు... ఇలా అరడజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. వారికంటే భిన్నంగా ఏం చేయగలనో ఆలోచించి, నాదైన శైలిలో ఫైట్స్, డ్యాన్స్ చేశా. మేకప్ లేకుండా సహజంగా నటించడంలో ‘మృగయా’లోని మిథున్ చక్రవర్తిగారు, స్టంట్స్ విషయంలో ‘షోలే’లో అమితాబ్‌గారు, డ్యాన్స్‌లో కమల్‌హాసన్‌గారు స్ఫూర్తిగా నిలిచారు. నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను’’. – హీరో చిరంజీవి
‘ది జర్నీ: ఫ్రమ్ అవుట్‌సైడర్ టు రూలర్’ అనే అంశంపై జరిగిన చర్చకు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మోడరేటర్‌గా వ్యవహరించగా, నటుడు షారుక్ ఖాన్, నటి దీపికా పదుకోన్ మాట్లాడారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేవాణ్ణి. అయితే కాస్త కూల్‌గా ఉండేవాడిని. యంగ్ షారుక్ అప్పుడు కూల్‌గా ఉన్నాడు కనుకనే ఇంత దూరం రాగలిగాడు’’ అన్నారు షారుక్. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమా వినోదం ప్రజలకు చౌకగా లభించాలి. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న థియేటర్స్ ఉండాలి.
అప్పుడు భారతీయ సినిమా దేశ నలుమూలలకు చేరువ అవుతుంది’’ అని చెప్పుకొస్తూ, దర్శక–నిర్మాత కరణ్ జోహార్ స్క్రిప్ట్‌ను తాను రిజెక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షారుక్. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరం తమ ఒరిజినాలిటీని కోల్పోకుండా ఉండాలని, ఇమేజ్‌ని నమ్మవద్దని సలహా ఇచ్చారు షారుక్. దీపికా పదుకోన్ మాట్లాడుతూ– ‘‘18 ఏళ్ల అమ్మాయి (తనని ఉద్దేశించి) ధైర్యంగా ఓ పెద్ద సిటీకి వచ్చింది. నా జర్నీని ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటుంటే... ఫర్లేదు. నేను బాగానే చేశాననిపిస్తోంది’’ అన్నారు.
‘వేవ్స్’ తొలి రోజున ఐదుగురు భారతీయ సినిమా దిగ్గజాల స్మారక తపాలా బిళ్లలను మోదీ విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి–దర్శక–నిర్మాత–గాయని భానుమతి ఉండటం విశేషం. ఇంకా దర్శక–నిర్మాత–నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్ ఘటక్, దర్శక–నిర్మాత రాజ్ ఖోస్లా, మ్యూజిక్ డైరెక్టర్ సలీల్ చౌదరిల పోస్టల్ స్టాంపులు కూడా ఉన్నాయి. భానుమతి కుటుంబం పక్షాన ఆమె మనవరాలు పి. మీనాక్షి స్టాంప్‌ను అందుకున్నారు.

‘‘కథ, కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో తమవైన లక్షల కథలు ఉన్నాయి. అసలు కథాకథనాలు మన నరనరాల్లో భాగం. ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదు. అయినప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం దీటుగా లేము. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక లాంచ్ ΄్యాడ్ ఇన్నాళ్లు కరువైంది. ఇప్పుడు సరిగ్గా ఆ లోటును తీర్చే ఆ లాంచ్ ΄్యాడ్ వేవ్స్’’. – దర్శకుడు రాజమౌళి – ముంబై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి