Nene Naa Movie Trailer : డ్యూయల్ రోల్‌లో అదరగొట్టిన రెజీనా

Regina Cassandra: వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి రెజీనా కసాండ్ర. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘నేనే… నా?’అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీగా రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తుంది. నిను వీడని నీడను నేనే వంటి హిట్ మూవీని డైరెక్ట్ చేసిన కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. అలానే జాంబీరెడ్డితో సూపర్ హిట్ ను అందుకున్న రాజశేఖర్ వర్మ తన ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘నేనే…నా?’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను నిధి అగర్వాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ లింగుసామి విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు పునరావృతమవుతున్నట్లు తెలుస్తోంది. రెజీనా 100 సంవత్సరాల క్రితం రాణి కాగా, ఆమె ప్రస్తుతం పురావస్తు శాస్త్రవేత్తగా, ఒక రహస్యమైన కేసును పరిష్కరించడానికి వచ్చినట్టు అర్థమౌతోంది. అడవిలో ఏకాంత ప్రదేశంలోకి ప్రవేశించే వ్యక్తులతో పాటు, రహస్యమైన కేసును పరిష్కరించడానికి కేటాయించిన వారు కూడా చంపబడుతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘నేనే నా..?! చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.