
ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి తారకరత్న.. హీరోగానే కాకుండా విలన్‌గానూ అభిమానులను అలరించారు. టాలీవుడ్‌లో పలు సినిమాలతో ఫ్యాన్స్‌ను మెప్పించారు. కానీ ఊహించని విధంగా చిన్న వయసులోనే అభిమానులకు, ఇండస్ట్రీకి దూరమయ్యారు. గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అయితే తాజాగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నను గుర్తు చేసుకుంది. నీతో ఉన్న రోజులు జీవితమంతా మర్చిపోలేనంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇటీవల మహాలయ అమావాస్య సందర్భంగా తన ముగ్గురు పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులర్పించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.
అలేఖ్య తన పోస్ట్‌లో రాస్తూ..'నా మనసులో భరించలేని బాధ ఉంది. అది ఎప్పటికీ మానిపోని గాయమని తెలుసు. నా మనసులోని ప్రతి విషయం ఎలా వక్రీకరించబడిందో చూసి నేను బాధపడ్డా. నీ కళ్లు శాశ్వతంగా మూసుకున్న తర్వాతే నీ కోరిక నెరవేరింది. అదే క్షణంలో మిగతావన్నీ కూడా నీతో పాటే వెళ్లిపోయాయి. ప్రస్తుతం నాకు బాధ కలిగించే రోజుల్లో.. నీ కథను తిరిగి వ్రాయడానికి చాలా ఆసక్తిగా ఉన్న ప్రపంచంలో ప్రయాణిస్తున్నా. కాలం గడిచే కొద్దీ మరింతగా నిన్ను మిస్ అవుతున్నా. కొన్ని రోజుల పాటు గాలి పీల్చుకోవడానికి చాలా బరువుగా అనిపిస్తోంది. దుఃఖం నా గొంతును చుట్టుకున్నట్లు, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా.. అయినప్పటికీ నేను ఆశను వదులుకోను.. ఎందుకంటే నీ హృదయ స్పందన ఇప్పటికీ నా కోసం చేరుకునే చిన్న చేతుల ద్వారా బ్రతికే ఉంది.. నిన్ను ఎప్పటికీ గుర్తుచేస్తుంది' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.