– నాగార్జున
‘‘లెనిన్’ సినిమాలో కొత్త అఖిల్‌ని చూడబోతున్నారు’’ అని పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. ఆయన తనయుడు అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తర్వాత జూన్ 26కి వాయిదా వేశారు మేకర్స్.
అయితే రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్ 25కి విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ‘పెద్ది, లెనిన్’ సినిమాల రిలీజ్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడనుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని, జూన్ 26నే విడుదలవుతుందనీ పుకార్లన్నింటికీ తన పోస్ట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టారు నాగార్జున. ‘‘నిన్న రాత్రి (మంగళవారం) మా ‘లెనిన్’ ఫస్ట్ కట్ చూశాను. నమ్మకంగా, గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమాలో కొత్త అఖిల్‌ని చూడబోతున్నారు. 2026 జూన్ 26వ తేదీని గుర్తుపెట్టుకోండి. థియేటర్లలో కలుద్దాం’’ అని బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాగార్జున.


