– వందో సినిమాలో ఫ్యాన్స్‌కి ట్రీట్
సెంచరీ టచ్ చేయడమంటే ఆ మజా వేరు. ప్రస్తుతం నాగార్జున ఆ జోష్‌లోనే ఉన్నారు. నటుడిగా నూరవ సినిమా మైల్ స్టోన్‌ని టచ్ చేశారు నాగ్. కెరీర్‌లో అత్యంత కీలకమైన మలుపు కాబట్టి తన నూరవ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగార్జున హీరోగా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 45 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో తాను 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వివిధ దశల్లో, విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు నాగార్జున ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పాతికేళ్ల యువకుడిగా కనిపించడానికి ‘డీ–ఏజింగ్’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట.
అభిమాన హీరో ఇలా తక్కువ వయసులో కనిపించడం అనేది ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్‌లాంటిదని చెప్పొచ్చు. ఇక సాదా సీదా స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రకథ తండ్రీ–కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందని కూడా నాగార్జున పేర్కొన్నారు. ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ వంటి టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట. ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం.


