సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి | Sakshi
Sakshi News home page

సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి

Published Sun, Jan 7 2024 1:49 AM

Naa Saami Ranga Theatrical Release On January 14 - Sakshi

‘‘ఆర్టిస్టులు సపోర్ట్‌ చేస్తే ఓ సినిమాను ఎంత త్వరగా పూర్తి చేయవచ్చో ఈ చిత్రంతో నేర్చుకున్నాను. నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌గార్లు సపోర్ట్‌ చేయడం వల్లే ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్‌కు రెడీ చేశాం’’ అన్నారు విజయ్‌ బిన్నీ. నాగార్జున హీరోగా ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సార్‌ థిల్లాన్, మిర్నా మీనన్‌ ఇతర కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’. విజయ్‌ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.ఈ సందర్భంగా శనివారం విలేకర్లతో విజయ్‌ బిన్నీ పంచుకున్న విశేషాలు.

► స్నేహం ప్రధానంగా సాగే చిత్రం ‘నా సామిరంగ’. 1980–1990 నేపథ్యంలో కథ సాగుతుంది. నాగార్జున, ‘అల్లరి’ నరేశ్‌గార్ల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. రాజ్‌ తరుణ్‌ది ఓ కీలక పాత్ర. అయితే ఈ ముగ్గురి కనెక్టింగ్‌ పాయింట్‌ ఏంటి? అనేది సినిమాలో చూడాలి. నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్‌ తరుణ్‌గార్ల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేశాను. సో.. నాకు వారితో కంఫర్ట్‌నెస్‌ ఉంది. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘΄పోరింజు మరియం జోస్‌’ సోల్‌ను మాత్రమే ‘నా సామిరంగ’ సినిమాకు తీసుకోవడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్పులు చేశాం. నాగార్జునగారు ఆయన అనుభవంతో కొన్ని సలహాలు చెప్పారు. నాగార్జునగారితో ఓ కొత్త దర్శకుడికి సినిమా అంటే అదృష్టమే. అందుకే ఈ సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

► దర్శకుణ్ణి కావాలనే చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. కొరియోగ్రాఫర్‌గా అయితే అన్ని క్రాఫ్ట్స్‌పై గ్రిప్‌ ఉండే చాన్స్‌ ఉందని భావించి, కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించాను. నేను ఓ కథతో నాగార్జునగారి దగ్గరకు వెళ్లాను. కానీ ఆయన ‘నా సామిరంగ’ కథ చేయమని చెప్పారు.ఈ కథను ఓన్‌ చేసుకుని దర్శకత్వం వహించాను. కమర్షియల్‌ పంథాలో నా శైలిలో ఈ సినిమాను ప్రత్యేకంగా తెరకెక్కించాను. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి.

► నేను కొరియోగ్రాఫర్‌ని కాబట్టి నాకు మ్యూజిక్‌ సెన్స్‌ ఉంటుంది. కీరవాణిగారిని ఏం అడిగినా, ఏదో ఒక సెన్స్‌తో అడుగుతున్నానని భావించి, సపోర్ట్‌ చేశారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు. ఓ కొరియోగ్రాఫర్‌గా విభిన్న రకాల పాటలు ఎలా చేశానో, అలానే దర్శకుడిగా విభిన్న రకాల సినిమాలు చేయాలని ఉంది.

 
Advertisement
 
Advertisement