నా మాటలను వక్రీకరించారు: మురళీధరన్‌

Muthiah Muralidaran On Biopic Uproar - Sakshi

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్‌ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు '800' చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’ అన్నారు

‘ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. గత ఏడాది నేను 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అయితే కొందరు దీన్ని వక్రీకరించి 'శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం సమాప్తమైంది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఇరువైపులా మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమాయకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను’ అని మురళీధరన్‌ స్పష్టం చేశారు. (చదవండి: ‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!)

అంతేకాక ‘నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ, ఆ విషయం గురించి ఆలోచించన తర్వాత, మురళీధరన్‌గా నేను సాధించిన విజయాలు నా ఒక్కడివే కాదనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ నా వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను’ అని తెలిపారు. ఇక "శ్రీలంక తమిళులు చనిపోతున్నప్పుడు ముత్తయ్య ఫిడేలు వాయించారు. తన సొంత ప్రజలు చనిపోయినప్పుడు అతను ఆనందించారు. అలాంటి వ్యక్తి క్రీడాకారుడిగా ఎంత సాధించినా ఉపయోగం ఏమిటి? మనకు సంబంధించినంతవరకు, ముత్తయ్య నమ్మకద్రోహం చేసాడు" అని ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా విమర్శించారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు! )

పీఎంకే చీఫ్ డాక్టర్ పి రామదాస్ మాట్లాడుతూ, "విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతాడు" అని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు, డార్ మోషన్ పిక్చర్స్, ఈ సినిమా "పూర్తిగా స్పోర్ట్స్ బయోగ్రఫీ" అని, దీనిలో శ్రీలంకలో తమిళుల పోరాటాలను తక్కువ చేసే సన్నివేశాలను చూపించమని చెప్పారు. ఈ వివాదాలపై విజయ్ సేతుపతి ఇంకా స్వయంగా స్పందించలేదు. 2017లో నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్ తన 2.0 చిత్రం నిర్మాతలు ఏర్పాటు చేసిన శ్రీలంక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నిరాశ్రయులైన తమిళులకు ఇళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీని ద్వారా తమిళులు పునరావాసం పొందారని అంతర్జాతీయ సమాజానికి తప్పుడు ప్రచారం చేయడానికి శ్రీలంక తన పర్యటనను ఉపయోగించుకోవచ్చని రజనీని హెచ్చరించాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top