
పీవీఆర్ మాల్‌లో అక్రమంగా రికార్డు చేసిన దుండగుడు
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిల్మ్ చాంబర్ ఫిర్యాదు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నాగార్జున, ధనుష్ ప్రధాన తారాగణంగా నటించిన కుబేర సినిమా విడుదలైన రోజే పైరసీ అయింది. దీని హెచ్‌డీ ప్రింట్ రెండు వెబ్‌సైట్లలో కనిపించడంతో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అంతర్గత దర్యాప్తు చేసి మూలాలను కనిపెట్టింది. దీని ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 2న సైబర్ క్రైమ్ పోలీసులు ఏడాదిన్నరలో 40 సినిమాలు పైరసీ చేసిన జన కిరణ్ కుమార్‌ను అరెస్టు చేశారు.
అది జరిగి నెల కూడా కాకముందే మరో పైరసీ ఉదంతం బయటకు రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. గత నెల 20న విడుదలైన కుబేర చిత్రం.. కొన్ని గంటలకే హెచ్‌డీ ప్రింట్ 1తమిళ్‌బ్లాస్టర్స్, 1తమిళ్‌ఎంవీ వెబ్‌సైట్లలోకి చేరింది. పైరసీ వెబ్‌సైట్లలో ఉన్న కుబేర చిత్రాన్ని అధ్యయనం చేసిన టీఎఫ్‌సీసీకి చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్.. జూన్ 20న పీవీఆర్ సెంట్రల్ థియేటర్‌లోని స్క్రీన్–5లో రికార్డు చేసినట్లు గుర్తించింది. ఇన్‌స్పెక్టర్ సబావత్ నరేష్ దర్యాప్తు చేపట్టారు.
ఏ సీటులో రికార్డు చేశారు?
ఫిల్మ్ చాంబర్ ఇచి్చన సమాచారం ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆ రోజు ఆ థియేటర్, ఆ స్క్రీన్ వద్ద, హాలు లోపల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి రికార్డింగ్స్‌ను జేబులో ఇమిడిపోయే హెచ్‌డీ కెమెరాలతో చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కుబేర చిత్రం రికార్డు అయిన తీరు ఆధారంగా ఏ సీటులో కూర్చుని రికార్డు చేశారనేది గుర్తిస్తున్నారు. ఇది తెలిస్తే ఆ ప్రాంతంలో సీట్లను టికెట్ బుక్ చేసుకున్న వారి వివరాలు సంగ్రహించి నిందితుడిని గుర్తించవచ్చని చెప్తున్నారు. పైరసీ వెబ్‌సైట్లు కొత్తగా విడుదలైన సినిమాలను వీలైనంత త్వరగా రికార్డు చేసి, దాని హెచ్‌డీ ప్రింట్‌తో కూడిన లింక్‌ను తమకు పంపడానికి దళారులను ఏర్పాటు చేసుకుంటాయని పోలీసులు చెబుతున్నారు.
ఇలా పంపించిన వారికి ఒక్కో సినిమాకు 300 నుంచి 400 డాలర్లు చెల్లిస్తాయని, ఈ లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలో జరుగుతాయని అంటున్నారు. నిందితులు క్రిప్టో కరెన్సీని జెబ్ పే, కాయిన్ డీసీఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్సే్ఛంజ్ చేసుకుని నగదుగా మార్చుకుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. పైరసీ కారణంగా గత ఏడాది తెలుగు సినీ పరిశ్రమ రూ.3,700 కోట్లు నష్టపోయినట్లు టీఎఫ్‌సీసీ అంచనా వేస్తోంది.
