మనీ లాండరింగ్‌ కేసులో హీరో సచిన్‌ జోషి అరెస్టు

Money Laundering Case: Enforcement Directorate Arrests Actor Sachiin Joshi - Sakshi

హీరో, వ్యాపారవేత్త సచిన్ జోషి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఓంకర్ రియల్టర్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు సచిన్‌ జోషిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రముఖ బిజినెస్ మెన్ విజయ్ మాల్యాకు సంబంధించిన గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాను ఇటీవల సచిన్ జోషి కొనుగోలు చేశాడు. అయితే ఈ విషయంలో ఓంకార్ రియాల్టీ కేస్, సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవతతవకలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌‌మెంట్ అధికారులు గుర్తించారు. ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో ఇంతకముందే ఈడీ అధికారులు జోషిని దర్యాప్తుకు పిలవగా నటుడు హాజరు కాలేదు. 

దీంతో ఈయన్ని ఆదివారం అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. విజయ్ మాల్యా కేసులో ఈయన్ని అరెస్ట్ చేయడం ముంబైలో సంచలనంగా మారింది. కాగా, గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్‌లు, క్లబ్‌లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు.

కాగా సచిన్‌ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా.. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్‌పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు. అయితే గతంలోనూ సచిన్‌ జోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 2020లో ముంబై పోలీసులు భారీ మొత్తంలో గుట్కాను సీజ్ చేశారు. ఈ కేసులో సచిన్ జోషి హస్తమున్నట్టు తెరపైకి రావడంతో హైదరాబాద్ పోలీసులు సచిన్ జోషిపై క్రిమినల్ పీనల్ కోడ్ 41 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
చదవండి: గుడ్‌న్యూస్‌: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే
కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top