Masaba Gupta: తల్లి ఓ స్టార్‌ నటి, తండ్రి ఓ స్టార్‌ ఆటగాడు.. కూతురు ఏమో ఇలా..

Masaba Gupta Open Up On Her Childhood, What She Imbibed from Mother Neena Gupta - Sakshi

మసాబా గుప్తా... పేరు వినగానే ముందు వాళ్లమ్మ నీనా గుప్తా.. తర్వాత వాళ్ల నాన్న వివ్‌ రిచర్డ్స్‌ను గుర్తుచేసుకునేవాళ్లున్నారు. కానీ ఈ ఇద్దరు లెజెండ్స్‌ నీడను కాదని సొంత ఉనికిని చాటుకుంటోంది మసాబా. ఈ రోజు ఇక్కడ ఆమె గురించి రాస్తున్నామంటే కారణం.. భిన్న రంగాల్లో మసాబా సాధిస్తున్న విజయాలు.. తెచ్చుకుంటున్న ఐడెంటిటీయే! 

మసాబా పుట్టింది ఢిల్లీలో.. పెరిగింది ముంబైలో. తల్లి నీనా గుప్తా బాలీవుడ్‌ నటి. తండ్రి వివ్‌ రిచర్డ్స్‌ వెస్టిండీస్‌... క్రికెట్‌ స్టార్‌. కాస్త ఊహ తెలిసేప్పటికే తండ్రి లాగా ఆటల్లో రాణించాలనుకుంది. టెన్నిస్‌లో శిక్షణ కూడా తీసుకుంది. తనకు పదహారో యేడు వచ్చే వరకూ టెన్నిస్‌ ఆడింది. వాళ్లమ్మేమో మసాబా నటి కావాలని కోరుకుంది. ఆ రెండూ కాక మసాబా మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ మీద ఆసక్తి పెంచుకుంది. లండన్‌ వెళ్లి ఆ రెండిటికీ సంబంధించిన కోర్స్‌ చేసింది. అప్పుడే.. తనకు పందొమ్మిదేళ్ల వయసప్పుడు లాక్మే ఫ్యాషన్‌ షోలో పాల్గొంది.

ఇక తను చేరుకోవాల్సిన గమ్యం అదే అని నిర్ణయించుకుంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ తీసుకుంది. డిజైనర్‌గా ష్యాషన్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ కీర్తిని ఆర్జించింది మసాబా. అప్పటి (2014) ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేతుల మీదుగా ‘బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’ అవార్డ్‌ను అందుకుంది. తల్లి నీనా గుప్తా కోరుకున్నట్టుగా 2020లో నటనా రంగంలోకి ప్రవేశించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అయిన ‘మసాబా మసాబా’ అనే వెబ్‌ సిరీస్‌తో నటిగా మారింది. ఒకరకంగా ఇది ఆమె జీవిత కథే.

అందులో మసాబా నటనకు మంచి పేరు వచ్చింది. తండ్రిలా ఆటల్లో, తల్లిలా నటనారంగంలో.. తనకులా ష్యాషన్‌ రంగంలో ఎందులోనైనా రాణించగలను అని నిరూపించుకుంది. ఈ మధ్యే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారంలోకి వచ్చిన ‘మోడర్న్‌ లవ్‌ ముంబై’ అనే ఆంథాలజీలోనూ నటించింది. నటిగా మరోసారి తన ప్రతిభను చూపింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన మాసాబా తన తల్లి నీనా గుప్తే తనకు ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మను చూస్తే ఏజ్‌ అనేది ఓ నంబర్‌ మాత్రమే అనిపిస్తుంది. 67 ఏళ్ల వయసులో కూడా వర్క్‌ చేస్తూ స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తోంది. తను జీవితంలో చాలా  ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. కానీ ఎప్పుడూ నిరాశను దరిచేరనివ్వలేదు. అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను.. కుంటున్నాను కూడా. తనే నాకు ఇన్‌స్పిరేషన్‌’ అని చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top