
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన చిత్రం కన్నప్ప. శివభక్తుడైన కన్నప్ప కథగా వచ్చిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్తో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలంతా నటించారు. ముఖ్యంగా మన పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమా అని మంచు విష్ణు రిలీజ్కు ముందే చెప్పారు. మన ఆధ్యాత్మిక చరిత్ర వారికి తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచింది. ఈ షోకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారంతా మురిసిపోయారు. ఈ సినిమా అనంతరం అద్భుతంగా ఉందని పలువురు ప్రముఖులు కొనియాడారు.
కన్నప్ప చిత్రంలోని భావోద్వేగాలు, విజువల్స్, ఆధ్యాత్మిక భావనల్ని ప్రశంసించారు. ‘కన్నప్ప’లోని చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్లో మంచు విష్ణు నటన అందరికీ గుర్తుండిపోతుంది. అతని నటన, స్క్రీన్ ప్రజెన్స్ మీద దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ విష్ణు నటన గురించి ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు, విమర్శకులు, సినీ ప్రముఖులు ఇలా అందరూ విష్ణు నటనను కొనియాడారు.