Lata Mangeshkar: నాది గొప్ప గాత్రం కాదు..సంగీతమంటే అయిష్టం 

Lata Mangeshkar And Her Family Does Not Like Music - Sakshi

ప్రపంచమంతా పడి చచ్చే తన గాత్రం నిజానికి అంత గొప్పదేమీ కాదని వినమ్రంగా చెప్పేవారు లతా మంగేష్కర్‌. ‘‘నేనో మంచి గాయనిని. అంతే. నాలో అసాధారణ ప్రతిభా పాటవాలేమీ లేవు. నాకంటే గొప్పగా పాడే చాలామంది కన్నా పేరు ప్రఖ్యాతులు దైవదత్తంగా నాకొచ్చాయంతే. అందుకే విజయాన్ని ఎప్పడూ నెత్తికెక్కించుకోకూడదు’’అని చెప్పేవారామె. ‘‘చిన్నప్పుడు సంగీత శిక్షణను తప్పించుకునేందుకు తలనొప్పి, కడుపు నొప్పి అంటూ నాన్నకు చాలా సాకులు చెప్పేదాన్ని. సాధన చేయిస్తుంటే పారిపోయేదాన్ని. ఆయన వెంటపడి పట్టుకుంటే నీ ముందు పాడటానికి సిగ్గేస్తోందంటూ పెనుగులాడేదాన్ని. దాంతో ‘నేను నాన్నను మాత్రమే కాను, నీ గురువును కూడా. ఎప్పటికైనా గురువును మించాలని తపించాలి. అంతే తప్ప పాడటానికి సిగ్గేస్తోందని అనకూడదు’అని ఓ రోజు అనునయించారు. ఆ మాటలను ఎప్పుడూ మరవలేదు’’అని చెప్పారు. 

సంగీతమంటే అయిష్టం 
నాన్నతో సహా ఇంట్లో ఎవరికీ సినీ సంగీతం పెద్దగా నచ్చేది కాదని, వాళ్లకు కర్ణాటక సంగీతమే ఇష్టమని లతా మంగేష్కర్‌ అంటారు. ‘‘నాన్నకు సినిమాలే ఇష్టం లేదు. మమ్మల్ని సినిమాలు కూడా చూడనిచ్చేవారు కాదు’’అని ఆమె పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఫొటోగ్రఫీ అంటే లతకు చాలా ఇష్టం. క్రికెట్‌ అన్నా అంతే. వెస్టిండీస్‌ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, రోహన్‌ కన్హాయ్‌ నుంచి గవాస్కర్, సచిన్‌ దాకా అందరినీ బాగా ఇష్టపడేవారు. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్‌ లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ సంతకం చేసిచ్చిన ఫొటోను ప్రాణంగా దాచుకున్నారు లత. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top