
బాలీవుడ్ జంట కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్ర తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు కియారా జన్మనిచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చేశాయి. ఇదే సమయంలో ఈ జోడీకి సంబంధించిన స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తోంది. సుమారు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట ఇదే ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు.
2014లో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ తెలుగులో 'భరత్ అనే నేను' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల్లో ఆమె నటించారు. అయితే, 2021లో విడుదలైన ‘షేర్షా’లో సిద్ధార్థ్, కియారా నటించారు. అక్కడి నుంచి మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. 2023 ఫిబ్రవరి 7న కుటుంబసభ్యుల సమక్షంలో రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. అయితే, వివాహం తర్వాత కూడా ఈ జోడీ సినిమాల్లో నటిస్తున్నారు. కియారా నటించిన 'వార్ 2' ఈ ఆగష్టు 14న విడుదల కానుంది. ఆపై సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పరమ్ సుందరి' జులై 25న విడుదల కానుంది.