
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్‌లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్‌నెస్ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్‌లో స్పందించారు. స్లిమ్‌గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు. తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్‌నెస్‌కు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌పెట్టారు.
(ఇది చదవండి: 'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా)
కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్‌లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా.. గతంలో స్లిమ్‌గా ఉంటూ తన ఫిట్‌నెస్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్.