అఫీషియల్‌ : బిగ్‌బాస్‌ హోస్టుగా కరణ్‌ జోహార్‌

Karan Johar To host OTT Version Of Bigg Boss Season-15 - Sakshi

ముంబై :  ప్రముఖ రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లోనూ బిగ్‌బాస్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇక హిందీలో ఇప్పటికే 14 సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ షో త్వరలోనే 15వ సీజన్‌లోకి అడుగుపెడుతుంది. అయితే ఈ సీజన్‌ను మాత్రం మేకర్స్‌ మరింత కొత్తగా ప్లాన్‌ చేశారు. బిగ్‌బాస్‌ పేరు నుంచి కంటెస్టెంట్స్‌ ఎంపీక వరకు ఎన్నో మార్పులు తెచ్చిన మేకర్స్‌ బిగ్‌బాస్‌ హోస్ట్‌ని కూడా మార్చేశారు.

గత 11 సీజన్లకు హోస్ట్‌గా షోను ఎంతగానో రక్తికట్టించిన సల్మాన్‌ ఖాన్‌ స్థానాన్ని ఇప్పుడు ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ భర్తీ చేయనున్నారు. దీంతో బిగ్‌బాస్‌ సీజన్‌ 15కి హోస్ట్‌గా కరణ్‌ వ్యవహరించనున్నారు. అయితే ఇది సీజన్‌ మొత్తానికి కాదు. కేవలం తొలి ఆరు వారాలకు గాను కరణ్‌ హోస్ట్‌గా చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్స్‌ నేరుగా టీవీలో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్‌(voot)లో 24×7 ప్రసారం కానుంది. ఆగస్టు 8నుంచి  ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. మరో విశేషం ఎంటంటే ఈ సీజన్‌ కంటెస్టెంట్స్‌ ఎంపిక నుంచి ప్రతివారం వారికి ఇచ్చే టాస్క్‌ల వరకు ప్రతిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని సమాచారం.

ఇక బిగ్‌బాస్‌ ఓటీటీలో ప్రసారం కానున్న తొలి ఆరు వారాల ఎపిసోడ్‌కు గాను హోస్ట్‌గా సిధార్థ్ శుక్లా, ఫరా ఖాన్, రోహిత్ శెట్టి వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా మేకర్స్‌ కరణ్‌ జోహార్‌ను సీజన్‌15 హోస్ట్‌గా ప్రకటిస్తూ ఊహాగానాలకు చెక్‌ పెట్టారు. ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ..'బిగ్‌బాస్‌ షోకి నేను, మా అమ్మ పెద్ద ఫ్యాన్స్‌. ఒక్కరోజు కూడా మిస్‌ కాకుండా చూస్తాం. అంతేకాకుండా నేను ఎప్పటికైనా బిగ్‌బాస్‌ షోను హోస్ట్‌ చేయాలని మా అమ్మ కోరిక. అది ఇప్పుడు నెరవేరుతుంది.

గతంలో ఎన్నో షోలకు హోస్ట్‌గా చేయడాన్ని ఎంజాయ్‌ చేశాను. కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా చేయడం మరింత ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది' అంటూ పేర్కొన్నారు. ఇక ఓటీటీలో ప్రసారం అయ్యే తొలి ఆరు వారాల ఎపిసోడ్లకు మాత్రమే కరణ్ హోస్టుగా ఉంటాడనీ, అనంతరం 'కలర్స్' టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు మాత్రం మళ్లీ యథావిధిగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడని సమాచారం.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top