Jai Bhim Director TJ Gnanavel to Helm Dosa King, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

సినిమా – బయోపిక్‌: దోసె కింగ్‌ పై ఆమె యుద్ధం

Published Tue, Jul 26 2022 12:14 AM

Jai Bhim director TJ Gnanavel to helm Dosa King - Sakshi

ఇరవై ఏళ్లు ఆమె న్యాయం కోసం యుద్ధం చేసింది. ఎక్కడా తగ్గలేదు.. దేనికీ భయపడలేదు. అవతల ఉన్నది వందల కోట్లకు అధిపతి, రెస్టరెంట్‌ రంగానికి సమ్రాట్, వేలాది ఉద్యోగుల దేవుడు ‘శరవణ భవన్‌’ రాజగోపాల్‌. కాని ఆయన వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆమె న్యాయపోరాటం చేసింది. ఆమె కథ ఇప్పుడు ‘జైభీమ్‌’ దర్శకుడు జ్ఞానవేల్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌లో ‘దోసె కింగ్‌’గా చిత్ర రూపం దాలుస్తోంది. ఆమె పేరు జీవజ్యోతి శాంతకుమార్‌. ఇది ఆమె పోరాటగాథ.

‘శరవణ భవన్‌’ పి.రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్‌ ‘శరవణ భవన్‌’ రెస్టరెంట్‌ పెట్టి, సక్సెస్‌ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్‌ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది.

ఆమె పేరు జీవజ్యోతి
జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్‌లో పని చేసే అసిస్టెంట్‌ మేనేజర్‌ కూతురిగా పి.రాజగోపాల్‌కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్‌ ‘దోసె కింగ్‌’ గా చెన్నైలో పేరు గడించాడు. శరవణ భవన్‌లో వేలాది ఉద్యోగులకు రకరకాల అలవెన్సులు ఇస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. అతని మాటకు ఎదురు లేదు. 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్‌ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది.

ట్యూషన్‌ మాస్టర్‌తో ప్రేమ
జీవజ్యోతి పి.రాజగోపాల్‌ను తన గార్డియన్‌ గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్‌ అనే లెక్కల ట్యూషన్‌ మాస్టర్‌ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్‌ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్‌ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి ఒప్పుకోలేదు. శాంతకుమార్‌ కూడా.

2001లో హత్య
జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్‌ తన దగ్గర పని చేసే డేనియల్‌తో 5 లక్షలకు డీల్‌ మాట్లాడుకుని శాంతకుమార్‌ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్‌ శాంతకుమార్‌ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్‌తో శాంతకుమార్‌ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్‌ జీవజ్యోతికి ఫోన్‌ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్‌. రాజగోపాల్‌ కాళ్లమీద పడి వదిలేయ్‌మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్‌ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్‌ అక్టోబర్‌ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్‌ 31న శాంతకుమార్‌ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్‌ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్‌ కమిషనర్‌ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్‌ సామ్రాజ్యం ఉలిక్కిపడింది.

సుదీర్ఘ పోరాటం
రాజగోపాల్‌కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్‌ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్‌ కోర్టు రాజగోపాల్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

దాని మీద రాజగోపాల్‌ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్‌. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్‌ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్‌ జూలై 9న అంబులెన్స్‌లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్‌ ప్రిజనర్స్‌ వార్డ్‌కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు.

సినిమా పేరు ‘దోసె కింగ్‌’
జంగిల్‌ పిక్చర్స్‌ వారు జీవ జ్యోతి నుంచి బయోపిక్‌ రైట్స్‌ కొనుక్కుని ‘జై భీమ్‌’ దర్శకుడు టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఈ పోరాటమంతా హిందీలో సినిమాగా తీయనున్నారు. తారాగణం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.‘నా పోరాటం సినిమాగా రానుండటం నాకు సంతోషంగా ఉంది’ అంది జీవ జ్యోతి. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఒక రోజైనా జైలులో ఉండకుండా రాజగోపాల్‌ మరణించడం పట్ల ఆమెకు ఇంకా అసంతృప్తే ఉంది.        

Advertisement
 
Advertisement
 
Advertisement