తులసి తలపెట్టినదానికి ఆదిలోనే ఆటంకం!

Intinti Gruhalakshmi June 4: Tulasi Scolds Lasya - Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 337వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

నందు నావాడు అంటూనే గోతులు తీయడం మొదలు పెట్టింది లాస్య. అతడిని పూర్తిగా తనవైపు తిప్పుకుని అతడి ఆఫీసులో పని చేసే ఉద్యోగి ద్వారా డబ్బు గుంజుతోంది. అటు తులసి కూడా ఎదగడానికి వీల్లేదని కంకణం కట్టుకుంది. తనను ఒక్క అడుగు కూడా ముందుకెళ్లనివ్వనని శపథం చేసింది. మరి నేటి(జూన్‌ 4) ఎపిసోడ్‌లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

నందు ఆఫీసులో ఉద్యోగులకివ్వాల్సిన జీతాలను లాస్య దొంగ లెక్కలతో తన అకౌంట్‌లోకి పంపించుకుంది. అతడి డబ్బులను కాజేసి నందుకే వెన్నపోటు పొడిచింది. ఈ విషయం తెలియని నందు ఆమెను గుడ్డిగా నమ్ముతుండటం గమనార్హం. పైగా ఆఫీసు లెక్కల బాధ్యతను కూడా లాస్యకే అప్పగించడం దురదృష్టకరం.. ఇదిలా వుంటే తులసి సొంతంగా ఏదైనా బిజినెస్‌ పెట్టాలని తహతహలాడుతోంది. అందులో భాగంగా కుట్టు మిషన్లు ఆర్డర్‌ ఇవ్వాలని, ఓ నలుగురిని పనిలో పెట్టుకోవాలని ప్లాన్‌లు వేస్తోంది. సరిగ్గా అప్పుడే వచ్చిన ప్రేమ్‌ ఒక టీవీ సీరియల్‌కు టైటిల్‌ సాంగ్‌ కంపోజ్‌ చేసే ఛాన్స్‌ వచ్చిందంటూ శుభవార్త చెప్పాడు. కొడుకు ఆశయం నెరవేరుతున్నందుకు తులసి తెగ సంతోషించింది.

ఏదైనా సాధించి తీరాలన్న తులసి స్థైర్యాన్ని దెబ్బతీయాలని లాస్య ఫోన్‌ చేసింది. 'మొగుడు లేనివాళ్లకు చిన్ననాటి స్నేహితుడే చేదోడువాదోడు.. నందు లేకపోయినా పక్కన రోహిత్‌ ఉన్నాడుగా..' అంటూ వక్రమాటలు మాట్లాడింది. దీంతో చిర్రెత్తిపోయిన తులసి.. లాస్య మీద అసహనం ప్రదర్శించింది. నిద్రపోతున్న సింహాన్ని లేపితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన లాస్య 24 గంటల్లో తానేంటో చూపిస్తానని వార్నింగ్‌ ఇచ్చింది.

మరోపక్క ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వాలా? అని మల్లగుల్లాలు పడుతున్న నందుకు లాస్య మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కోసారి ఇలాంటివి ఎదురవుతాయంటూనే మళ్లీ అప్పు చేయమని సూచించింది. అప్పు చేస్తే వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోతుందని నందు టెన్షన్‌ పడుతుంటే లాస్య మాత్రం తన అకౌంట్‌లో డబ్బు జమైందని లోలోపలే సంతోషపడింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో లాస్య.. తులసి తలపెట్టిన పనికి ఆదిలోనే ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించింది. తులసి ఎంతో కష్టపడి గీసిన డిజైన్లను తనకు తెలియకుండా మాయం చేసేసి దెబ్బ తీసింది. మరి ఇది జిత్తులమారి లాస్య పన్నిన కుట్ర అని తులసికి తెలుస్తుందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

చదవండి: సితార: చేతిలో పువ్వు  పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత లుక్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top