సోనూసూద్‌కు పద్మసేవా పురస్కార ప్రదానం | Hyderabad Man Honored Actor Sonu Sood With Padma Seva | Sakshi
Sakshi News home page

సోనూకు పద్మసేవా పురస్కార ప్రదానం చేసిన నగరవాసి

Dec 17 2020 8:34 AM | Updated on Dec 17 2020 8:50 AM

Hyderabad Man Honored Actor Sonu Sood With Padma Seva - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సేవ అనే పదం వింటే చాలు సోనూసూద్‌ గుర్తుకొస్తున్నాడు. ఏ కష్టం వచ్చినా దేవుడికి దండం పెట్టుకొని తర్వాత సోనూకు ఓ అప్లికేషన్‌ కూడా పెడుతున్నారు సామాన్యులు. సోనూ అసాధారణ సేవలకు యూఎన్‌ఓ నుంచి ప్రతిష్టాత్మక స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డ్‌ అందుకున్నాడు. యూకేకు చెందిన ఈస్టర్న్‌ ఐ పత్రిక ‘టాప్‌ 50 సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీస్‌ ఇన్‌ ద వరల్డ్‌’ లిస్ట్‌లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచాడు. సేవతో.. అటు పేరు ప్రతిష్టలు, ఇటు ప్రతిష్టాత్మక పురస్కారాలనూ అందుకుంటున్న సోనూసూద్‌కి అవార్డ్‌ ఇవ్వాలంటే మాటలా? కానీ సిటీకి చెందిన ఓ సాధారణ కార్పెంటర్‌ సోనూకు అవార్డ్‌ ఇవ్వడం, దాన్ని ఆయన వినమ్రంగా స్వీకరించడం విశేషం.   

నగరానికి చెందిన ఇంద్రోజిర రమేష్‌ ఓ కార్మికుడు. బాల్యమంతా కష్టనష్టాలతోనే నెట్టుకొచ్చాడు. ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురుచూసిన సందర్భాలెన్నో.. దాంతో సామాజిక సేవకులంటే అమితమైన ఆరాధన ఆయనకు.. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు వెళ్లే వారిని వెతికి మరీ ఆసరా అందిస్తారు. అలాంటి మానవతా వాదులను వెతుక్కుంటూ వెళ్లి తనే స్వయంగా తయారు చేసిన ప్రతిమని బహుకరించి పద్మ సేవా అవార్డుతో సత్కరిస్తాడు. కొంతకాలంగా సేవకుల్ని సత్కరిస్తూ వస్తున్న ఈ సేవ బాలీవుడ్‌ స్టార్, మానవతావాదిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సోనూసూద్‌కు చేరింది. 

ఓ నమస్కారం.. ఓ పురస్కారం.. 
తన స్తోమతకి మరొకరికి సాయం చేయలేడు.. కానీ అలా అండగా నిలుసున్నవారిని అభినందించాలని తపనపడ్డాడు. ఆ తపన ఫలితమే ‘పద్మ సేవా పురస్కారం’. తనో మంచి కళాకారుడు కూడా.. అద్భుతమైన ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేస్తాడు. అలా సమాజ సేవ చేస్తున్న వారి సేవలు ప్రతిబింబించేలా ప్రతిమని తయారు చేసి వారివద్దకే వెళ్లి చిరు సత్కారంతో అందిస్తాడు. ఇలా సామాజిక సేవకులను వెతుక్కుంటూ రాష్ట్రాలు సైతం దాటి వెళ్లాడు. ఇప్పటి వరకు 95 మందికి పైగా వీటిని అందించాడు. అందులో ఉచితంగా గుండె ఆపరేషన్స్‌ చేయిస్తున్న లారెన్స్, కష్టాల్లో ఉన్నవారికి ‘నేను సైతం’ అంటూ అండగా నిలిచిన లక్ష్మీ మంచు, 220 సార్లు రక్తదానం చేసిన సంపత్‌ కుమార్, భిక్షాటనతో సంపాదించిన రూ.3 లక్షలను సమాజానికే ఖర్చు చేసిన కామరాజు లాంటి వారు ఎందరో ఉన్నారు.  

సోనూ.. ది గ్రేట్‌.. 
కరోనా కష్టకాలంలో పేదవారికి పెద్ద దిక్కుగా మారాడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా చేసినా నిజజీవితంలో మాత్రం ప్రజల మనసు గెలుచుకున్న హీరోగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోనూసూద్‌ను ఎలాగైనా తన అవార్డ్‌తో సత్కరించాలనుకున్నాడు రమేష్‌. నగరానికి వచ్చిన సోనూసూద్‌ను కలిసి ప్రతిమతో సత్కరించాడు.  

ఎన్నో కష్టాలు అనుభవించా.. 
చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించా.. ఆ సమయంలో నాకు ఎవరూ సాయం చేయలేదు. ఎన్నో ఏళ్లుగా కార్పెంటర్‌గానే కొనసాగుతున్నాను. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వారంటే నాకు ఎంతో ఇష్టం. నా ఆర్థిక స్తోమతకు తగ్గట్లు నేనే సొంతంగా అవార్డు తయారు చేసి వారికి అందజేస్తున్నాను. అందరూ ఎంతో సంతోషంగా తీసుకొని నన్ను మెచ్చుకుంటున్నారు. – రమేష్, కార్పెంటర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement