Hero Sushanth Web Series: సినిమాలు లేవన్న యాంకర్‌.. సీరియస్‌ అయిన హీరో

Hero Sushanth Fire On Anchor In Maa Neela Tank Pre Release Event - Sakshi

Hero Sushanth Fire On Anchor: యంగ్‌ హీరో సుశాంత్‌ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టాడు. 'మా నీళ్ల ట్యాంక్‌' అనే వెబ్‌ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్‌ సిరీస్‌ను 'వరుడు కావలెను' ఫేమ్‌ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్‌ చేశారు. ఈ సిరీస్‌లో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించగా.. సుదర్శన్‌, ప్రేమ్‌ సాగర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో జులై 15 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే దీనికి ముందు గురువారం (జులై 14) నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌పై హీరో సుశాంత్‌ ఫైర్ అయ్యాడు. 

'సినిమాల్లేకపోతేనే సిరీస్‌లు చేయాలా? మంచి కథలు ఉన్నప్పుడు సినిమాలే కాదు.. వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తాను. మా నీళ్ల ట్యాంక్‌ వెబ్‌ సిరీస్‌లో మంచి కంటెంట్‌ ఉందా? లేదా? అనేది చూశాక మాట్లాడు' అంటూ యాంకర్‌పై అసహనం వ్యక్తం చేశాడు హీరో సుశాంత్. అయితే ఇదంతా నిజంగా కాదులేండి. ఈ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో భాగంగా హీరో సుశాంత్, నటుడు, కమెడియన్‌ సుదర్శన్‌ సరదాగా ఓ స్కిట్ చేశారు. ఇందులో సుశాంత్‌ను ఇంటర్వ్యూ చేసే యాంకర్‌గా స్టేజ్‌పైకి వచ్చి సందడి చేశాడు. ఈ క్రమంలో వెబ్‌ సిరీస్‌ గురించి సుశాంత్‌ చెబుతుంటే 'మనలో మన మాట సినిమాల్లేవా?' అని సుదర్శన్ ప్రశ్నించడంతో 'సినిమాల్లేకపోతేనే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలా? చూస్తేనే కదా ఇది ఎలా ఉందో తెలిసేది. చూడకుండా ఎలా మాట్లాడుతున్నావ్‌? కంటెంట్‌ ఉందో లేదో సిరీస్‌ చూస్తేనే తెలుస్తుంది' అని కోపంతో సమాధానమిచ్చాడు సుశాంత్‌. అయితే దీనికి సంబంధించిన వీడియోను సుశాంత్ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఆకట్టుకుంటుంది. 

కాగా ఇటీవల జరిగిన'లడ్కీ: ఎంటర్‌ ది డ్రాగన్‌ గర్ల్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ శ్యామలపై సంచలనాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఆర్జీవీ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం (జులై 13) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది శ్యామల. మార్షల్‌ ఆర్ట్స్‌ బేస్‌డ్‌ మూవీ కాబట్టి ఓ గేమ్‌ ఆడదామని అడిగింది. ఇప్పటివరకూ ఇతర భాషల్లో వచ్చిన మార్షల్‌ ఆర్ట్స్‌  సినిమాలను తెలుగులో చెప్తాను, ఆ సినిమా టైటిల్‌ ఏంటో కరెక్ట్‌గా గెస్‌ చేయాలంది. దీనికి వర్మ ఏమీ సమాధానమివ్వకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.

చంపూ రశీదు సినిమా ఒరిజినల్‌ టైటిల్‌ ఏంటో చెప్పమని శ్యామల మొదటి ప్రశ్న అడిగింది. దీనికి వర్మ ఆ పేరెప్పుడూ వినలేదే అని తల గోక్కున్నాడు. దీంతో శ్యామల కిల్‌ బిల్‌ అని ఆన్సరిస్తూ నవ్వేసింది. ఇది జోకా? అని ఓ చూపు చూసిన వర్మ.. ప్రస్తుతం నేను ఎమోషనల్‌గా ఉన్నాను. ఇది సీరియస్‌ సినిమా. ఇలాంటి జోకులు వద్దు అంటూ స్టేజీపై నుంచి విసురుగా వెళ్లిపోయాడు. దీంతో శ్యామల.. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ క్షమాపణలు చెప్పింది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top