‘సత్యం’ సినిమా చేయవద్దని చెప్పారు : జెనీలియా | Genelia Talks About Junior Movie | Sakshi
Sakshi News home page

‘సత్యం’ సినిమా చేయవద్దని చెప్పారు : జెనీలియా

Jul 16 2025 11:03 AM | Updated on Jul 16 2025 11:16 AM

Genelia Talks About Junior Movie

‘‘నా కెరీర్‌ ప్రారంభం నుంచి ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ‘బొమ్మరిల్లు’లో నేను చేసిన హాసిని పాత్ర మరచిపోలేనిది. అలాగే ‘హ్యాపీ’లో మధుమతి, ‘కథ’ సినిమాలో చిత్ర.. ఇలా విభిన్నమైన పాత్రలు చేశాను. ‘తుజే మేరీ కసమ్‌’ (నువ్వేకావాలి హిందీ రీమేక్‌)తో హిందీలో ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత ‘బాయ్స్‌’ సినిమా చేశాను. ఆ వెంటనే ‘సత్యం’ సినిమా అంగీకరించాను. అయితే ఆ సమయంలో ‘సత్యం’ చేయవద్దని నాకు కొంత మంది చెప్పారు. కానీ కథ నచ్చడంతో నా మనసు మాటవిని ఆ సినిమా చేస్తే హిట్‌గా నిలిచింది. కథ మనకు నచ్చితే చేయాలి.. ఆ తర్వాత ప్రేక్షకులే మనల్ని గుర్తిస్తారు’’ అని నటి జెనీలియా తెలిపారు.

 కిరీటి రెడ్డి, శ్రీలీల జోడీగా, జెనీలియా కీలక పాత్రలో నటించిన చిత్రం ‘జూనియర్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జెనీలియా విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తండ్రీకొడుకుల కథే ‘జూనియర్‌’. ఈ చిత్రంలో నేను ఓ లేడీబాస్‌ తరహా పాత్ర చేశాను. కిరీటి పాత్రతో నా రోల్‌కు ఉండే రిలేషన్‌  ఏంటి? అనేది సినిమాలో చూడాలి. శ్రీలీల అమేజింగ్‌ నటి. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. సాయి కొర్రపాటిగారు గ్రాండ్‌గా నిర్మించారు. 

కథానాయికలకు పెద్దగా అభిమానులు ఉండరు. కానీ ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్రతో చాలా మంది నాకు అభిమానులయ్యారు. నా కెరీర్‌లో బిజీగా ఉన్నప్పుడే నా తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్‌’ హీరో రితేష్‌ను వివాహం చేసుకున్నాను. పెళ్లి తర్వాత తెలుగు సినిమాల్లో గ్యాప్‌ వచ్చింది. మళ్లీ నేను తిరిగి తెలుగు సినిమాలు ఎప్పుడు చేస్తున్నానని నా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అడుగుతూనే ఉన్నారు. వారిలో మహిళలు ఎక్కువమంది ఉండటం నాకు సంతోషంగా అనిపించింది. 

తెలుగు అభిమానులు నన్ను హాసినిగానే గుర్తుపెట్టుకున్నారు. ‘బొమ్మరిల్లు 2’ ఉంటుందేమో చూడాలి. నాకంటూ డ్రీమ్‌ రోల్స్‌ లేవు. అసలు నేను నటిని కావాలనుకోలేదు. అలాంటిది ఇండస్ట్రీలోకి రావడం, ఇన్ని పాత్రలు చేయడం, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించడం... ఇవన్నీ నాకు కలగానే అనిపిస్తాయి. 

నా యాక్టింగ్‌ కెరీర్‌ను కొనసాగిస్తాను. చిన్న పాత్రా? పెద్ద పాత్రా? అనేది ముఖ్యం కాదు. నా పాత్ర కథపై ప్రభావవంతంగా ఉంటే చాలు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో నేను సినిమాలు చేశాను. వాళ్లందరూ ఇప్పుడు స్టార్స్‌ అయిపోయారు.. వాళ్ల ప్రయాణంలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది.

 ‘బొమ్మరిల్లు’ సినిమాలో కోట శ్రీనివాసరావుగారితో కలిసి నటించడాన్ని మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత రితేష్‌– నేను మా ప్రొడక్షన్‌లో ‘వేద్‌’ (తెలుగు సినిమా మజిలీ మరాఠి రీమేక్‌) సినిమా చేశాం. మంచి ప్రేమకథ కుదిరితే మళ్లీ కలిసి నటిస్తాం’’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement