కరోనా టైంలో ఓటీటీలు జనాలకు బాగా అలవాటైపోయాయి. సరిగ్గా ఆ టైంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ నుంచి ఇప్పటివరకు రెండు సీజన్లు వచ్చాయి. అయితే మూడో సీజన్ ఎప్పుడొస్తుందా మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
2019లో 'ద ఫ్యామిలీ మ్యాన్' తొలి సీజన్ రాగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. కామెడీకి కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకున్నాయి. 2021లో వచ్చిన రెండో సీజన్లో సమంత విలన్‌గా చేయడం ఆశ్చర్యపరిచింది. అయితే మూడో సీజన్ రావడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టేసింది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై చైనా ఎటాక్, దీనికోసం కొవిడ్ వైరస్‌ని ఉపయోగించడం తదితర అంశాలు మూడో సీజన్ కాన్సెప్ట్.
రాజ్, డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మూడో సీజన్.. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు. ప్రధాన పాత్రలైన శ్రీకాంత్, సుచితో పాటు వీళ్ల పిల్లలిద్దరినీ చూపిస్తూ ఓ కామెడీ వీడియోతో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తొలి రెండు సీజన్లలానే ఈ సీజన్ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీతో పాటు ఇంగ్లీష్‌లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఇక్కడితో ముగిస్తారా లేదంటే నాలుగో సీజన్ కూడా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


