
‘‘చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా అంటే చాలామంది యాక్టింగ్ అనుకుంటారు. అలా నేను కూడా అమెరికాలో యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. ఫిల్మ్ మేకింగ్ గురించి షార్ట్ కోర్సు చేశాను. నాట్యం నేర్చుకున్నాను. నటన, సాహిత్యం, సంగీతం వంటి అంశాలపై మరింత అవగాహన పెంచుకున్నాను. డైరెక్షన్ అనేది చాలా కష్టమైన క్రాఫ్ట్. నేను నిర్మించిన గత రెండు సినిమాలు (‘కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’) నాకు అనుభవాన్ని ఇచ్చాయి. దీంతో ‘కొత్తపల్లిలో ఒకప్పుడు..’ సినిమాతో దర్శకురాలిగా మారాను’’ అన్నారు నటి–నిర్మాత– దర్శకురాలు ప్రవీణ పరుచూరి.
మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో, ప్రవీణ పరుచూరి ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. దగ్గుబాటి రానా సమర్పణలో పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ–‘‘మన గ్రామ దేవతలపై మనకు నమ్మకం, విశ్వాసం ఉంటుంది. కొందరికి చెట్టుపై కూడా నమ్మకం ఉంటుంది. ఈ సినిమాలో ఓ చెట్టు గురించిన ప్రస్తావన కూడా ఉంది.
అలాంటి నమ్మకాలను ఈ సినిమాలో న్యూట్రల్‌గా చూపించే ప్రయత్నం చేశాం. అల్లు అర్జున్ గారితో పోలిక పెట్టడం లేదు కానీ..‘పుష్ప2’ సినిమాలోని జాతర సీన్ తరహా ఎనర్జీ ఉండే ఓ సీన్ ఉంది. రానాగారు మంచిగా సపోర్ట్ చేశారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఈ సినిమా చేయడం సవాల్‌గా అనిపించలేదు. కానీ, ఓ డాక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా టైమ్‌ను కేటాయించుకోవడం నాకు సవాల్‌గా అనిపించింది. నా తొలిమూడు సినిమాలు ఉత్తరాంధ్ర నేపథ్యంతోనే ఉన్నాయి. నా తర్వాతి సినిమాను సిటీ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తాను. ఓ పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయాలని ఉంది’’ అని చెప్పారు.