
‘‘స్కూల్ డేస్ నుంచే నాకు రైటింగ్ అంటే ఇష్టం. కథలు చెప్పడం ఇంకా ఇష్టం. అలా కొన్ని కథలు రాసుకున్నాను. నా స్నేహితులు రానా, నాని వంటివారు బాగా సపోర్ట్ చేశారు. ఒక దశలో సినిమా కథ రాయగలననే నమ్మకం కలిగింది. అలా రాసుకున్న కథే ఈ ‘తెలుసు కదా’’ అని అన్నారు నీరజ కోన. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ఆమె పంచుకున్న విశేషాలు...
⇒ ‘తెలుసు కదా’ మంచి ప్రేమ కథా చిత్రం. ప్రేమకథతోపాటు ఒక కాంప్లెక్స్ సిటీ కూడా ఉంది. నేను మహిళా దర్శకురాలిని కనుక ఈ సినిమా కథను మహిళా దృష్టి కోణంలో చెప్పలేదు. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే నా కథను సిద్ధు జొన్నలగడ్డ ఓకే చేయడం, దర్శకురాలిగా నాకు అవకాశం రావడం నా లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్.
⇒ సిద్ధుపై టిల్లు క్యారెక్టర్ షాడో ఉండొచ్చు. కానీ, తను మంచి పెర్ఫార్మర్. ఈ సినిమాలో స్క్రీన్ పై తను పోషించిన వరుణ్‌పాత్రని మాత్రమే ఆడియన్స్ చూస్తారు. కథలో కాంప్లెక్స్‌గా ఉండే రాగపాత్ర కోసం శ్రీనిధిని తీసుకున్నాం. మెచ్యూర్డ్ క్యారెక్టర్ అంజలిపాత్రకి రాశి సరిపోయారు. టీజీ విశ్వప్రసాద్‌గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. ఈ సినిమా ప్రయాణంలో కృతీ ప్రసాద్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ .
⇒ నేను ఏ సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయలేదు. కానీ, కాస్ట్యూమ్ డిజైనర్‌గా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, విజయ్, సూర్య వంటి టాప్ హీరోలు చేసిన సినిమాలకు పని చేశాను. అదే నా లెర్నింగ్ స్కూల్, ఎక్స్‌పీరియన్స్. ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం. ఇప్పటికీ నేను ప్రతిదీ నా తొలి సినిమా అన్నట్లుగా భయం, టెన్షన్ తో పనిచేస్తుంటాను. దర్శకురాలిగా నా తర్వాతి చిత్రం కూడా లవ్‌స్టోరీనే. త్వరలోనే వివరాలు చెబుతాను.