Dil Raju: మనవడి ధోతి ఫంక్షన్, యంగ్‌గా కనిపిస్తున్న దిల్ రాజు

Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో అతడి మనవడు ఆరాన్ష్ ధోతి ఫంక్షన్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వేడుకలు కోలాహాలంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఈ ఫంక్షన్‌లో అందరూ ఎల్లో, వైట్ కాంబినేషన్‌లో కుర్తాలు ధరించగా దిల్ రాజు మాత్రం పూర్తిగా తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతున్నాడు. తన గారాల మనవడిని ఆప్యాయంగా భుజాన ఎత్తుకుని ఆడిస్తూ మురిసిపోతున్నాడు. ఆరాన్ష్‌ను ఎత్తుకుని డ్యాన్స్ కూడా చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా మనవడు పుట్టాక దిల్ రాజులో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు కనిపిస్తోంది.
కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించిన విషయం తెలిసిందే. వీరికి ఉన్న ఏకైక కుమార్తె హన్షిత రెడ్డి. ఆమె కొడుకుకు జన్మనివ్వడంతో తాను తాతనయ్యానోచ్ అంటూ అతడు ఎంతగానో మురిసిపోయాడు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా మనవడి దగ్గర వాలిపోయి అతడితోనే కాలక్షేపం చేస్తున్నాడు. ఇక ఒంటరిగా ఉన్న తండ్రికి మళ్లీ పెళ్లి చేయాలని హన్షిక ఆశపడింది. ఆమె కోరికను కాదనలేని ఈ నిర్మాత గతేడాది వైఘా రెడ్డి(తేజస్విని)ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఆరంభించాడు.
ఇదిలా వుంటే దిల్ రాజు.. వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల కామెడీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్3' సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే నాగచైతన్య 'థాంక్యూ', సమంత 'శాకుంతలం', అవసరాల శ్రీనివాస్ 'నూటొక్క జిల్లాల అందగాడు', రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు.