– సీహెచ్ సతీష్ కుమార్
‘‘ఓ సాధారణ మనిషికి ఎదురయ్యే సమస్యలు, భావోద్వేగాలతో ‘కర’ సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులందరికీ ఈ మూవీ కనెక్ట్ అవుతుంది’’ అని విఘ్నేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సీహెచ్ సతీష్ కుమార్ తెలిపారు. ధనుష్, మమితా బైజు జంటగా నటించిన తమిళ చిత్రం ‘కర’.
విఘ్నేష్ రాజా దర్శకత్వంలో కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించారు. ఈ సినిమా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ద్వారా తెలుగులో నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సీహెచ్ సతీష్ కుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అర్జున్ రెడ్డి, కబాలి, సింగం 3, సలార్, కాంతారా చాప్టర్ 1’ వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేశాను.
ధనుష్‌గారి ‘ధర్మయోగి’ సినిమాని తెలుగులో రిలీజ్ చేశాను. ‘కర’ మూవీ తెలుగు వెర్షన్ చూడలేదు. అయినప్పటికీ ధనుష్, విఘ్నేశ్‌గార్లపై నమ్మకంతో రిలీజ్ చేస్తున్నాను. ఈ మూవీ కోసం నా ఫ్రెండ్ రాజేశ్‌కుమార్ బొబ్బర సపోర్ట్ తీసుకున్నాను. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తెలుగులో 80 శాతం బిజినెస్ పూర్తి చేశాం. ఈ మూవీని నైజాంలో ‘దిల్’ రాజుగారు, ఉత్తరాంధ్రలో నేను పంపిణీ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


