 
													కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు భారీ చిత్రాలకు బ్రాండ్‌గా మారిన విషయం తెలిసిందే. మానగరం వంటి చిన్న చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, లియో ఆపై కమలహాసన్ కథానాయకుడిగా విక్రమ్, రజనీకాంత్ హీరోగా కూలీ తదితర భారీ యాక్షన్ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక్క చిత్రం ఆశించిన విజయం సాధించకపోతే ఇంతకు ముందు ఎన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించినా అవి లెక్కలోకి రావన్నది దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు వర్తిస్తుంది.
ఈయన తాజాగా తెరకెక్కించిన కూలీ చిత్రం అంచనాలను చేరుకోలేకపోయింది. అంతే లోకేష్ కనకరాజ్‌పై ట్రోలింగ్స్ వైరల్ కావడం మొదలెట్టాయి. అంతే కాదు హిందీలో షారూఖ్ ఖాన్‌తో చేయాల్సిన చిత్రం డ్రాప్ అయ్యిందనే ప్రచారం వైరల్ అయ్యింది. అదే విధంగా కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించే చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు అదీ చేజారి పోయింది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వానికి చిన్న బ్రేక్ ఇచ్చి నటనపై దృష్టి పెట్టారు.
లోకేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలై నిర్మాణంలో ఉంది. ఇది గ్యాంగ్‌స్టర్ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం కోసం లోకేష్ కనకరాజ్ చాలా కసరత్తులు చేసి పాత్రకు తగినట్లు తనను తాను మలచుకున్నట్లు తెలిసింది. ఇకపోతే ఇందులో ఆయనకు జంటగా నటించే నాయకి ఎవరన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిందీ బ్యూటీ వామిక కబి(Wamiqa Gabbi) ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ భామ ఇంతకు ముందు మాల్ నేరత్తు మయక్కమ్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి కల్లా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తదుపరి కార్తీ హీరోగా ఖైదీ–2 చేయడానికి లోకేష్ కనకరాజ్ రెడీ అవుతారని సమాచారం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
