
హీరో రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే పాన్‌ఇండియా సినిమాలో నటిస్తున్నారు రామ్‌చరణ్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.
‘పెద్ది’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు రామ్‌చరణ్. ‘ఆర్‌సీ 17’ అన్నది వర్కింగ్ టైటిల్. ‘రంగస్థలం’(2018) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు సుకుమార్. ‘పెద్ది’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఏమాత్రం విరామం లేకుండా ‘ఆర్‌సీ 17’ని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట రామ్‌చరణ్– సుకుమార్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘వన్: నేనొక్కడినే’ సినిమా ద్వారా కృతీసనన్‌ని తెలుగుకి పరిచయం చేశారు సుకుమార్. ఆ తర్వాత ‘దోచెయ్, ఆదిపురుష్’ వంటి తెలుగు సినిమాల్లో నటించారు కృతీసనన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీని ‘ఆర్‌సీ 17’ ద్వారా మరోసారి టాలీవుడ్‌కి తీసుకురానున్నారట సుకుమార్. మరి రామ్‌చరణ్‌కి జోడీగా కృతీసనన్ నటిస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.