Bigg Boss 5 Telugu: ఇతడిది ఫేక్‌ గేమ్‌, వాడిని కడిగిపారేస్తా: సన్నీ ఎమోషనల్‌

Bigg Boss Telugu 5: Sreerama Chandra New Captain Of BB House - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 26: కెప్టెన్సీ అంటే కంటెస్టెంట్లకు ఓ వరంలాంటిది. నామినేషన్స్‌ నుంచి తప్పించే ఓ ఆయుధం వంటిది. అలాంటి కెప్టెన్సీ చాన్స్‌ను దక్కించుకునేందుకు ఇంటిసభ్యులు హోరాహోరీగా పోరాడారు. చివరికి ముగ్గురు బరిలో నిలిచారు. కానీ హౌస్‌మేట్స్‌ మద్దతుతో శ్రీరామచంద్ర గెలిచాడు. మరి హౌస్‌మేట్స్‌ ఎవరెవరికి సపోర్ట్‌ చేశారు? నేటి (సెప్టెంబర్‌ 30) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

పిజ్జాలు ఆరగించిన కంటెస్టెంట్లు
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ నేడు కూడా కొనసాగింది. మెరుపుల శబ్ధం రాగానే బజర్‌ నొక్కిన శ్వేత.. సిరి-షణ్ముఖ్‌లను తమకు పోటీదారులుగా ఎంచుకున్నారు. వీరికి బిగ్‌బాస్‌ 'చిక్కులో చిక్కుకోకు' అనే టాస్క్‌ ఇచ్చాడు. చిక్కులు పడి ఉన్న తాళ్లను విడదీసే ఈ టాస్కులో శ్వేత టీమ్‌ గెలిచింది. ఇంతటితో గేమ్‌ ముగిసిందన్న బిగ్‌బాస్‌ ఏ జంటలు ఎక్కువగా బరువు తగ్గాయో చెక్‌ చేసుకోమన్నాడు. ఈ క్రమంలో మానస్‌ రెండు రోజుల్లోనే ఆరు కిలోల బరువు తగ్గి అందరితో ఔరా అనిపించుకున్నాడు. మొత్తానికి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ముగియడంతో అప్పటిదాకా ఆకలితో నకనకలాడుతున్న ఇంటిసభ్యులకు రుచికరమైన పిజ్జాలు పంపించాడు. వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చిన కంటెస్టెంట్లు ఆవురావురుమని తిన్నారు.

నిన్ను రేషన్‌ మేనేజర్‌ చేస్తా: హమీదాకు శ్రీరామ్‌ ఆఫర్‌
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో.. సన్నీ-మానస్‌, హమీదా- శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌- శ్వేత జంటలు ఎక్కువ బరువు కోల్పోయాయి. ఒక్కో జంటలో నుంచి ఒక్కొక్కరు కెప్టెన్సీకి పోటీదా చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో ఈ మూడు జంటలు తమలో ఎవర్ని పంపించాలా? అని తెగ చర్చించారు. ఈ క్రమంలో కెప్టెన్‌ తర్వాత ముఖ్యమైన పోస్ట్‌ ఏంటని శ్రీరామ్‌ ప్రశ్నించగా హమీదా రేషన్‌ మేనేజర్‌ అని ఆన్సరిచ్చింది. తనకు రేషన్‌ మేనేజర్‌ ఇష్టం లేదన్న శ్రీరామ్‌ తను గెలిస్తే హమీదాకు ఆ పోస్ట్‌ ఇప్పిస్తానన్నాడు. ఏ కారణం లేకపోయినా తనను నామినేట్‌ చేస్తున్నారని, కెప్టెన్‌ అయితే ఒకవారం ఇమ్యూనిటీ వస్తుందని ఆశపడ్డాడు. ఎలాగో సన్నీ పోటీలో నిలబడ్డా అతడికి ఎవరూ సపోర్ట్‌ చేయరని చెప్పాడు. అనంతరం శ్రీరామచంద్ర, శ్వేత, సన్నీ 'కత్తులతో సావాసం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నారు. ఇందులో హౌస్‌మేట్స్‌ కెప్టెన్‌కు అర్హులు కారు అనుకున్నవారి బెల్ట్‌ను కత్తితో పొడవాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు.

కెప్టెన్‌ డ్రెస్‌ తెచ్చుకున్నా, అది వేసుకోవడానికైనా గెలిపించండి
నేను కెప్టెన్‌ డ్రెస్‌ తెచ్చుకున్నా, అది వేసుకోవడానికైనా నన్ను గెలిపించండని సన్నీ పేరుపేరునా అభ్యర్థించాడు. శ్రీరామ్‌ మాత్రం.. మీకు ఎవరు కరెక్ట్‌ అనిపిస్తే వారికే ఓటేయండని ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారం ముగియగానే అసలు టాస్క్‌ మొదలైంది. ముందుగా శ్వేత మాట్లాడుతూ.. తను కెప్టెన్‌ అయితే హౌస్‌ స్ట్రిక్ట్‌గా మారుతుందని హెచ్చరిక వదిలింది. ఇక శ్రీరామ్‌.. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను సాల్వ్‌ చేస్తానని చెప్పాడు. సన్నీ.. అందరూ తనకు సమానమే అని, హౌస్‌లో పక్షపాతంగా వ్యవహరించనని ప్రామిస్‌ చేశాడు.

నీకింకా కెప్టెన్‌ అయ్యే సమయం రాలేదు
తర్వాత హౌస్‌మేట్స్‌ ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ పోటీదారుల్లో ఎవరు కెప్టెన్సీకి అనర్హులో వారికి కత్తి గుచ్చారు. మొదటగా వచ్చిన విశ్వ.. సన్నీ బెల్ట్‌కు కత్తి గుచ్చాడు. తర్వాత షణ్ను.. మన మధ్య అంత ర్యాపో లేదంటూ మళ్లీ సన్నీకే కత్తి గుచ్చాడు. అయితే ఈ రెండు కత్తిపోట్లను సన్నీ ముందే ఊహించాడు. విశ్వ సింపథీ గేమ్‌ ఆడుతున్నాడని, అతడిక్కడ ఫేక్‌ గేమ్‌ ఆడుతున్నాడని శ్రీరామ్‌తో చెప్పుకొచ్చాడు. తర్వాత సిరి.. సన్నీకే గుచ్చాలని లేదంటూనే అతడినే కత్తితో పొడిచింది. నీకింకా కెప్టెన్‌ అయ్యే టైం రాలేదంటూ లోబో కూడా సన్నీని ఒక్క పోటు పొడిచాడు. అయితే లోబో పొడుస్తాడని ఊహించని సన్నీ కంటతడి పెట్టుకోవడంతో మానస్‌ ఓదార్చాడు. హమీదా.. శ్వేతను; ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌.. సన్నీని; యానీ మాస్టర్‌.. శ్రీరామ్‌ను కత్తితో పొడిచారు. కెప్టెన్‌గా నువ్వేదైనా చెప్తే జనాలు అంత సీరియస్‌గా తీసుకోలేరేమోనని రవి, త్వరగా ఆవేశపడతావంటూ ప్రియాంక సింగ్‌.. మరోసారి సన్నీకి కత్తిపోట్ల రుచి చూపించారు.

ఫ్రెండ్‌షిప్‌ గుర్తొస్తుంది, కత్తితో పొడవలేను: కాజల్‌
తర్వాత సన్నీ రవి దగ్గరకు వెళ్లి ఇక్కడ హౌస్‌లో ఏ కెప్టెన్‌ కూడా కమాండింగ్‌ చేయట్లేదని కౌంటరిచ్చాడు. తర్వాత వచ్చిన మానస్‌.. సన్నీని పొడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. మిగిలిన ఇద్దరిలో ఎవరు తనను ఇంప్రెస్‌ చేస్తే వారిని పొడవనని మాటిచ్చాడు. దీంతో ఇద్దరూ.. కెప్టెన్‌ అయితే అలా ఉంటాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని ఉపన్యాసాలివ్వగా మానస్‌ శ్వేతను కత్తితో గుచ్చి శ్రీరామ్‌కు సపోర్ట్‌ చేశాడు. నిజానికి సన్నీని కసాకసా వేద్దాం అనుకున్నా, కానీ నాకు ఫ్రెండ్‌షిప్‌ గుర్తొస్తుంది, కాబట్టి అతడిని కత్తితో గుచ్చి బాధపెట్టలేను అంటూ శ్వేతను కత్తితో పొడిచింది కాజల్‌. తర్వాత వచ్చిన జెస్సీ.. సన్నీ, శ్వేత తన మనసులో కెప్టెన్‌లంటూ శ్రీరామ్‌ను కత్తితో గుచ్చాడు. తక్కువ కత్తిపోట్లు పడ్డ శ్రీరామ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో నాలుగో కెప్టెన్‌గా అవతరించాడు.

శ్రీరామ్‌కు ఎందుకు సపోర్ట్‌ చేశాడు?: సన్నీ
అయితే కెప్టెన్సీకి అవకాశం ఉన్న శ్వేతకు మానస్‌ కత్తి గుచ్చడంతో అయోమయానికి లోనయ్యాడు సన్నీ. నిజానికి తన మాటలతో ఇంప్రెస్‌ చేసింది శ్వేత అయితే శ్రీరామ్‌కు ఎందుకు సపోర్ట్‌ చేశాడో అర్థం కావడం లేదని, ఇదే విషయాన్ని వాడినే అడిగి కడిగిపారేస్తానని ఆవేశపడ్డాడు. మరోపక్క మానస్‌ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని వదులుకున్నందుకు తెగ ఫీలైంది పింకీ. నువ్వే కెప్టెన్‌ అవుతావనుకున్నా, ఇంకోసారి అస్సలు కాంప్రమైజ్‌ అవ్వకు అని అతడి దగ్గరకు వెళ్లి వార్నింగ్‌ ఇచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top