
హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు.
నాకు ఇష్టమైన జానర్
👻 టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచి నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్‌లో నిర్మించిన ‘కాంచన’ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ కౌశిక్ ‘కిష్కింధపురి’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. హారర్ కారణంగా మా సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలమైందని సెన్సార్ సభ్యులు అభినందించడం ఆనందాన్నిచ్చింది.
👻 ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌ని సెట్‌గా వేశాం. అలాగే ఓ పాడుబడ్డ గృహంలో షూట్ చేశాం. మంగళవారం ఈ సినిమాని మా స్నేహితులతో కలిసి థియేటర్స్‌లో చూశాం... సినిమా అదిరిపోయింది. సౌండ్ డిజైనర్ రాధాకృష్ణగారు సౌండ్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు. కౌశిక్ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ పరిమితులుంటాయి. కానీ, సాహు గారపాటిగారు ఆడియన్స్‌కి ద బెస్ట్ ఇవ్వాలని రాజీ పడకుండా నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు.
👻 ‘మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్లో మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని సరదాగా అన్నాను... దాన్ని వైరల్ చేశారు. మా చిత్ర కథ అంత ఆసక్తిగా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు... ఇండస్ట్రీలోనే ఉంటాను... భవిష్యత్‌లో దర్శకత్వం కూడా చేస్తాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కథ ఉంటే నేను, నా తమ్ముడు సాయి గణేశ్ కలిసి సినిమా చేస్తాం.
చదవండి: బిగ్‌బాస్: 5 నెలల బాబు.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?