
నటించిన సినిమా టైటిల్ ఇంటి పేరుగా.. పోషించిన పాత్ర తమ పేరుగా జనానికి గుర్తుండిపోయిన నటులు అరుదే! అలాంటి అరుదైన గుర్తింపును సంపాదించుకున్న నటి బర్ఖా సింగ్! బర్ఖా అంటే వానజల్లు. పేరుకు తగ్గట్టే ఆమె వెండి.. వెబ్ తెర మీద కనిపించే హావభావాల జల్లు!
► పుట్టింది రాజస్థాన్‌లోని బికనేర్‌లో. పెరిగింది ముంబై. బర్ఖా చదువులో ఫస్ట్. సేయింట్ జేవియర్స్ కాలేజ్‌లో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్, అమెరికాలోని బర్కిలీ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ బిజినెస్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. ఈ రెండిటితో ఆగకుండా ఎమ్మే సోషియాలజీ కూడా చదివింది.
► నాలుగో ఏట నుంచే నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ‡ముఝ్‌సే దోస్తీ కరోగే, సమయ్ : వెన్ టైమ్ స్ట్రైక్స్, పరిణీత, అప్నా ఆస్మాన్, యే హై ఆషికీ, లవ్ బై చాన్స్ వంటి చిత్రాల్లో నటించింది. రంగస్థలం మీదున్న మక్కువతో స్కూల్ రోజుల్లోనే థియేటర్‌లో ప్రతిభ కనబర్చింది. అదే ఆమెకు వెండితెర అవకాశాలను తెచ్చిపెట్టింది.
► చానెల్ విలో వీడియో జాకీగా పనిచేసింది. అదే సమయంలో ఎన్నో కమర్షియల్ యాడ్స్, టీవీ సీరియల్స్‌లోనూ నటించింది.
► ఎమ్‌టీవీ ‘గర్ల్స్ ఆన్ టాప్ బ్రాడ్‌కాస్ట్ షో’లో గియా సేన్ పాత్ర బర్ఖా సింగ్‌కు బాగా పేరు తెచ్చింది. అలానే ‘ఫనా’ సీరియల్లో పోషించిన వేదిక పాత్ర కూడా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది.
► ‘సైలెన్స్.. కెన్ యు హియర్ ఇట్’ లాంటి థ్రిల్లర్‌తో పాటు ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’, ‘ఇంజినీరింగ్ గర్ల్స్’, ‘హోమ్ స్వీట్ హోమ్’, ‘ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్’, ‘మర్డర్ మేరీ జాన్’, ‘మసాబా మసాబా’, ‘ద గ్రేట్ వెడ్డింగ్స్ ఆఫ్ మ్యూన్స్’ వంటి వెబ్ సీరీస్‌లోనూ నటించింది. తాజాగా మాధురీ దీక్షిత్‌తో ‘మజా మా’ అనే వెబ్ మూవీలో వెబ్ స్క్రీన్ షేర్ చేసుకుంది బర్ఖా.
► షూటింగ్ లేని రోజు వంట చేయడం బర్ఖాకు చాలా ఇష్టం. వంట.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతుంది ఆమె. అలాగే ఏ కొంచెం టైమ్ దొరికినా పుస్తకం పట్టుకుంటుంది. నాన్ ఫిక్షన్‌ను తెగ చదువుతుంది.
నటిని కాకపోయుంటే మార్కెటింగ్ ప్రొఫెషనల్‌ని అయి ఉండేదాన్ని. లేకుంటే జంతు హక్కులపై పనిచేసే ఏదైనా ఎన్‌జీఓలో పనిచేసేదాన్ని.
– బర్ఖా సింగ్